బెంగళూరు బంద్.. అనిల్ కుంబ్లే ఆర్టీసీ బస్సు ప్రయాణం

  • కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించిన శక్తి స్కీమ్‌కు వ్యతిరేకంగా ప్రైవేటు రవాణా వాహన యజమానులు బంద్‌కు పిలుపు
  • బెంగళూరులో లక్షల్లో నిలిచిపోయిన వాహనాలు, ప్రయాణికులకు ఇక్కట్లు
  • మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేకూ తప్పని ఇబ్బందులు
  • ఎయిర్‌పోర్టు నుంచి తన ఇంటి వరకూ ఆర్టీసీ బస్సులో ప్రయాణం
  • ఆయన జర్నీ తాలుకు ఫొటో నెట్టింట్లో వైరల్
బెంగళూరు బంద్ కారణంగా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఇక్కట్ల పాలయ్యారు. క్యాబ్‌లు, ఇతర ప్రైవేటు రవాణా వాహనాల యజమానులు బంద్ పాటిస్తుండటంతో అనిల్ కుంబ్లే తప్పనిసరి పరిస్థితుల్లో బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి ఆర్టీసీ బస్సులో తన ఇంటికి చేరుకున్నారు. తన బస్సు ప్రయాణానికి సంబంధించి ఆయన నెట్టింట్లో షేర్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 

కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి పథకం తమ పొట్టకొడుతోందంటూ ప్రైవేటు రవాణా వాహనాల వారు బంద్‌కు పిలుపునిచ్చారు. తమ ఆదాయం తగ్గిపోతోందంటూ గగ్గోలు పెట్టారు. ఈ సమస్యకు పరిష్కారంగా శక్తి స్కీమ్‌ను ప్రైవేటు బస్సులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, నగరంలో బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించాలని కూడా డిమాండ్ చేశారు. నిత్యం బిజీబిజీగా ఉండే బెంగళూరు నగరంలో ప్రజాజీవితం బంద్ నేపథ్యంలో అస్తవ్యస్తమైంది. అయితే, ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించడంతో వారు బంద్‌ను ముగించారు.


More Telugu News