నిన్న మా అమ్మానాన్నల పెళ్లి రోజు... 5 నిమిషాలు కూడా మాట్లాడనివ్వలేదు: లోకేశ్

  • రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
  • రాజమండ్రిలోనే మకాం వేసిన నారా లోకేశ్
  • ఈ సాయంత్రం ప్రెస్ మీట్
  • తమ న్యాయపోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ
  • తమ కుటుంబం ఇప్పటికీ షాక్ లోనే ఉందని వెల్లడి
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. తన తండ్రి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో, లోకేశ్ కూడా రాజమండ్రిలోనే మకాం వేశారు. 

ఈ సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. ప్రజల కోసం చేసే పోరాటంలో చంద్రబాబు అరెస్ట్ అంశం ఓ స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ దృష్ట్యా యువగళం పాదయాత్రకు తాత్కాలికంగానే విరామం ప్రకటించామని, పరిస్థితులు సర్దుకున్నాక మళ్లీ యువగళం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. 

తాము ఒంటరివాళ్లం అయ్యామని భావించడంలేదని, ప్రజలు తమ వెంటే ఉన్నారని తెలిపారు. తమ న్యాయపోరాటం కొనసాగుతుందని, జడ్జిమెంట్ తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని లోకేశ్ చెప్పారు. 

"మా నాన్నను చిన్నప్పుడు టీవీల్లో చూసేవాడ్ని. నేను 8వ తరగతి వరకు నాన్నను ఎక్కువసార్లు ప్రత్యక్షంగా చూసింది లేదు. కుటుంబం కంటే ప్రజలు, ప్రజాసేవ కోసమే పరితపించిన నాయకుడు ఆయన. నిన్న అమ్మానాన్నల పెళ్లిరోజు. ఆయనతో 5 నిమిషాలు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. 

ఇప్పటికీ మా కుటుంబం చంద్రబాబు జైలుకెళ్లారన్న షాక్ లోనే ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. సైకోతో పోరాడుతున్నప్పుడు ఇవన్నీ తప్పవని మాకు మేము సర్దిచెప్పుకున్నాం. చంద్రబాబు జైల్లోకి వెళుతూ మీ పోరాటం ఆపొద్దని చెప్పారు. 

యువగళం పాదయాత్రకు, చంద్రబాబు ప్రజా పోరాటానికి ఈ ప్రభుత్వం బాగా భయపడిందన్న విషయం తాజా పరిణామాలతో స్పష్టమైంది. ప్రజా చైతన్యంలో భాగంగా పార్లమెంటరీ పార్టీ సమావేశాలు విస్తృతంగా నిర్వహిస్తాం. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు ప్రకటిస్తాం" అని లోకేశ్ వెల్లడించారు.


More Telugu News