హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో 'రైల్ కోచ్ రెస్టారెంట్'... ఫొటోలు ఇవిగో!

  • పాత రైలు బోగీలకు రెస్టారెంట్ హంగులు
  • ఆధునికంగా తీర్చిదిద్దిన బోగీలో రెస్టారెంట్ ఏర్పాటు
  • వివిధ రకాల వంటకాలతో వినియోగదారులకు సేవలు
  • దక్షిణ మధ్య రైల్వే వినూత్న కార్యాచరణ
హైదరాబాద్ లోని ప్రముఖ సందర్శనీయ స్థలాల్లో నెక్లెస్ రోడ్ ఒకటి. ఇక్కడికి నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్ కోచ్ రెస్టారెంట్ ను ప్రారంభించింది. 

వినియోగంలో లేని రైలు బోగీని రెస్టారెంట్ తరహాలో ఆధునికీకరించారు. వినియోగదారులకు సరికొత్త అనుభూతినిచ్చేలా అన్ని హంగులతో ఈ రెస్టారెంట్ ను తీర్చిదిద్దారు. చూపులకు మాత్రమే కాదు, రుచుల పరంగానూ ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ అదరహో అనిపిస్తుంది. 

ఇక్కడి మెనూలో అనేక సుప్రసిద్ధ వంటకాలకు చోటుకల్పించారు. నగరానికి చెందిన బూమరాంగ్ రెస్టారెంట్ కు ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. హైదరాబాదులోని రైల్వే స్టేషన్లలో దశలవారీగా ఇటువంటి రైల్ కోచ్ రెస్టారెంట్లను ఏర్పాటు చేయాలన్నది దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక. 

ఇంతకుముందు కాచిగూడ రైల్వే స్టేషన్ లోనూ ఓ రెస్టారెంట్ ప్రారంభించారు. దీనికి మంచి ప్రజాదరణ లభిస్తోంది. ఇప్పుడు నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన రైల్ కోచ్ రెస్టారెంట్ కు కూడా వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ఆశిస్తోంది. చిరుతిళ్లు, అల్పాహారాలు, భోజనం, ఇతర రకాల వంటకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. పార్శిల్ సదుపాయం కూడా ఉంది.


More Telugu News