ఈ వయస్సులో అరాచకంగా అరెస్ట్.. 60 గంటలు నిద్రలేకుండా చేశారు: హర్షకుమార్

  • పద్నాలుగేళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తిని హింసించి, వేధించడం ఏమిటన్న హర్షకుమార్   
  • ఓ మానసిక రోగి సంతృప్తి కోసం కొన్ని వ్యవస్థలు పని చేస్తున్నాయని ఆగ్రహం
  • స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయనకు అండగా ఉంటామని వ్యాఖ్య
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ దారుణమని, తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఆయన రాజమండ్రి కేంద్రకారాగారం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఏడుపదులు దాటిన వయస్సులో చంద్రబాబును అక్రమ కేసులతో జైలుకు పంపించడం సరికాదన్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని హింసించి, వేధించడం ఏమిటన్నారు. ఓ మానసిక రోగి సంతృప్తి కోసం కొన్ని వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయో ఈ వ్యవహారం స్పష్టం చేసిందన్నారు. అధికారుల తీరును హర్షకుమార్ తప్పుబట్టారు.

అరెస్ట్ చేసిన తీరు బాధాకరమన్నారు. అరాచకంగా ఆయనను తీసుకెళ్లారని, నంద్యాలలో అరెస్ట్ చేసి, విజయవాడలో రోజంతా విచారించి, ఆ తర్వాత రాజమండ్రి తీసుకెళ్లారన్నారు. ఆయనకు దాదాపు అరవై గంటలు నిద్రలేకుండా చేశారని, ఇది చాలా బాధించిందన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయలేదని, కాబట్టి బీజేపీ, వైసీపీ ఒక్కటేనని తెలుసుకోవాలని హితవు పలికారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయనకు అండగా ఉంటామని చెప్పారు.


More Telugu News