చంద్రబాబు తప్పును ఒప్పుకొని రాజకీయాల నుంచి తప్పుకోవాలి: బొత్స సత్యనారాయణ

  • చంద్రబాబు పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయన్న బొత్స
  • టీడీపీ నేతలు పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • చంద్రబాబు తప్పుడు పనికి  అందరూ తలదించుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్య
  • బాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపణ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తన తప్పును ఒప్పుకొని రాజకీయాల నుంచి వైదొలగాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. సోమవారం బొత్స మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయన్నారు. అయినప్పటికీ టీడీపీ నేతలు పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలు అమాయకులని టీడీపీ భావిస్తోందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన తప్పుడుపనికి రాష్ట్రమంతా తలదించుకోవాల్సి వచ్చిందన్నారు. ఆయన అంత నిజాయతీపరుడే అయితే కోర్టులో నిరూపించుకోవాలన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ అంశం కేబినెట్ తీసుకున్న నిర్ణయమే కావొచ్చునని, కానీ ప్రభుత్వాధినేతగా ఆయనకు బాధ్యత లేదా? అన్నారు. చేసింది తప్పుడు పని, దొంగ పని కానీ ఇంకా పెద్దమనిషిలా, యుగపురుషుడిలా బిల్డప్ ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలోను భారీ అవినీతి జరిగిందన్నారు. రాజధాని విషయంలోను అవకతవకలు జరిగాయన్నారు. అన్ని వ్యవస్థలను టీడీపీ అధినేత చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించారు. ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నారని, అన్ని వ్యవస్థలను చేతుల్లోకి తీసుకున్నారన్నారు.

మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఒక్కరే అరెస్ట్ కాలేదని, గతంలో ఉత్తరాదిన ముఖ్యమంత్రిగా పని చేసినవారు, కేంద్రమంత్రులుగా పనిచేసినవారు కూడా అరెస్టయ్యారన్నారు. వారి కంటే చంద్రబాబు అంత గొప్పవాడా? అన్నారు. అన్ని కోణాల్లో విచారణ జరిపిన తర్వాతే ఆయనను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. జగన్ పాలనలో తప్పులకు, అవినీతికి తావులేదని, ఎంత పెద్దవారైనా ఊరుకోరన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చుట్టం కాదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.


More Telugu News