చంద్రబాబు 'హౌస్ రిమాండ్' పిటిషన్ విచారణ తర్వాత బెయిల్ కోసం దరఖాస్తు

  • 437(1) ప్రకారం మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేయనున్న న్యాయవాదులు
  • 409 సెక్షన్ ఈ కేసుకు వర్తించదని మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశం
  • పిటిషన్ తిరస్కరిస్తే హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధం  
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకి హౌస్ ‌రిమాండ్ విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. హౌస్ రిమాండ్ ‌పై విచారణ అనంతరం చంద్రబాబు తరఫు న్యాయవాదులు మరో రెండు పిటిషన్లు దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు పిటిషన్లను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. హౌస్ రిమాండ్ పిటిషన్‌పై విచారణ తర్వాత 437(1) ప్రకారం మధ్యంతర బెయిల్ పిటిషన్, 409 సెక్షన్ ఈ కేసుకు వర్తించదని మరో పిటిషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. ఈ రెండు పిటిషన్లను ఒకేసారి ఏసీబీ కోర్టులో దాఖలు చేయనున్నారని తెలుస్తోంది.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండు విధించింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత రాజమండ్రి కేంద్రకారాగారానికి తరలించారు. అయితే, చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌ను సీఐడీ వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. హౌస్ రిమాండ్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేస్తే చంద్రబాబు తరఫు లాయర్లు హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 


More Telugu News