వారంలో నాలుగు రోజులే పని.. స్కాట్లాండ్ లో ప్రయోగం

  • ఏడాది పాటు అమలుకు ప్రణాళిక
  • ఫలితాల ఆధారంగా పూర్తి స్థాయి అమలుపై నిర్ణయం
  • గతేడాది బ్రిటన్ లోనూ ఇదే తరహా అధ్యయనం
స్కాట్లాండ్ ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. ఎంపిక చేసిన ప్రభుత్వ అధికారులకు వారంలో నాలుగు రోజులు పనిచేసే విధానాన్ని అమలు చేయబోతోంది. పలు ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీల్లో దీన్ని తొలుత అమలు చేయనున్నారు. పని రోజులను కుదించడం వల్ల వస్తున్న ఫలితాలు ఎలా ఉన్నాయి? లాభ, నష్టాలపై లోతైన పరిశీలన అనంతరం దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. 

ఉద్యోగుల క్షేమం, పర్యావరణంపై ప్రభావం తగ్గించడం, ఉత్పత్తి పెంచడం అనేవి నాలుగు రోజుల పని విధానం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఏడాది పాటు ఇలా ఎంపిక చేసిన శాఖల్లో దీన్ని అమలు చేస్తారు. మరోవైపు బ్రిటన్ గతేడాదే నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేసి చూసింది. 61 సంస్థల్లోని 3,000 ఉద్యోగులకు ఆరు నెలల పాటు దీన్ని అమలు చేసి చూశారు. ప్రయోగం ముగిసిన తర్వాత మెజారిటీ ఉద్యోగులు  వారంలో నాలుగు రోజుల పని విధానాన్నే ఎంపిక చేసుకున్నారు. 

అమెరికా, ఐర్లాండ్, ఆస్ట్రేలియాలోనూ ఇదే తరహా అధ్యయనాలు జరిగాయి. వీటిల్లో మెరుగైన ఫలితాలే కనిపించాయి. తద్వారా పనిదినాల కుదింపునకు సానుకూల పరిస్థితి ఏర్పడింది. పనిదినాలను కుదించడం వల్ల ఉద్యోగులకే కాకుండా, సంస్థలకు కూడా అదనపు ఉత్పత్తితో అనుకూలతలు ఉంటున్నట్టు గుర్తించారు.


More Telugu News