మద్యపానంతో మహిళలకే మరింత హాని
- పురుషులతో పోలిస్తే స్త్రీలకు ఆల్కహాల్ తో రిస్క్ ఎక్కువ
- కాలేయం త్వరగా దెబ్బతినే ప్రమాదం
- ఎక్కువ సమయం పాటు రక్తంలో ఆల్కహాల్ నిల్వ
- బ్రెస్ట్ కేన్సర్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువే
సంపన్న వర్గాల్లో మద్యపానం అలవాటు మహిళలకూ చేరిపోయింది. అంతేకాదు, ఎగువ మధ్యతరగతి లోనూ ఈ ధోరణి కనిపిస్తోంది. నిజానికి మద్యపానం సేవనంతో పురుషుల మాదిరే మహిళల్లోనూ ఒకే విధమైన స్పందన కనిపించదు. శారీరకంగా పురుషులతో పోలిస్తే మహిళల నిర్మాణం వేరు. మగవారితో పోలిస్తే మహిళల శరీరాల్లో ఫ్యాట్ ఎక్కువగా, నీరు తక్కువగా ఉంటుంది. ఫ్యాట్ కు ఓ వినూత్నమైన గుణం ఉంది. ఆల్కహాల్ ను అది గ్రహించి ఉంచుతుంది. శరీరంలో ఫ్యాట్ తక్కువగా ఉండి, నీరు ఎక్కువగా ఉంటే, దానివల్ల ఆల్కహాల్ పలుచన అవుతుంది. కనుక మగవారితో పోల్చి చూసినప్పుడు, ఒకే విధమైన ఆల్కహాల్ పరిమాణంతో అధిక ఫ్యాట్ కంటెంట్ వల్ల స్త్రీల రక్తంలోకి అధిక ఆల్కహాల్ చేరి ఎక్కువ సమయం పాటు నిలిచి ఉంటుంది. అలాగే, మహిళల్లో ఆల్కహాల్ డీహైడ్రోజెనస్ అనే ఎంజైమ్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా వారి రక్తంలో ఎక్కువ ఆల్కహాల్ ఎక్కువ సమయం పాటు తిరుగుతుంటుంది.
- ఆల్కహాల్ సేవనం వల్ల కాలేయం దెబ్బతినడం జరుగుతుంది. పురుషులతో పోలిస్తే మహిళల జీవక్రియలు భిన్నంగా ఉంటాయి. కనుక, మహిళలు మద్యపానం సేవిస్తే ఎక్కువ రిస్క్ ను చూడాల్సి వస్తుంది. వారి కాలేయం త్వరగా దెబ్బతింటుంది.
- అధిక మద్యపానం మహిళల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఆల్కహాల్ తో ఈస్ట్రోజెన్ హార్మోన్ పెరిగి, ప్రొజెస్టరాన్ అణచివేతకు గురవుతుంది. దీంతో బ్రెస్ట్ కేన్సర్ రిస్క్ పెరుగుతుంది. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత ఇది వచ్చే రిస్క్ ఎక్కువ.
- చిన్న వయసులోనే మహిళలు మద్యపానం ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి సంతాన అవకాశాలు తగ్గిపోతాయి. నెలసరి గతి తప్పడం, పీఎంఎస్ లక్షణాలు, పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపిస్తాయి.
- యుక్త వయస్సులో మద్యపానం సేవించడం వల్ల ఎముకల అభివృద్ధి అనుకున్నంత స్థాయిలో ఉండదు. ఇది ఆస్టియోపోరోసిస్ కు దారితీస్తుంది.
- వృద్ధాప్యంలో పరిమితంగా ఆల్కహాల్ సేవించడం వల్ల సానుకూల ఫలితాలు కనిపిస్తాయని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈస్ట్రోజెన్ పెరిగి ఎముకలు దృఢంగా మారతాయి.