ఏఐతో 90 శాతం ఉద్యోగులకు గండం: క్రెడ్ సీఈవో

  • ఏఐ రిస్క్ ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదన్న కునాల్ షా
  • ఏఐ నైపుణ్యాలు నేర్చుకుంటే నెగ్గుకు రావచ్చన్న అభిప్రాయం
  • ఉద్యోగుల పనిని ఏఐ సులభతరం చేస్తుందన్న అంచనా
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ/కృత్రిమ మేథ)తో ఉపాధి రంగంపై పెద్ద ప్రభావమే పడనుంది. ఏఐ టూల్స్ ఎంత ముఖ్యమో క్రమంగా తెలిసి వస్తోంది. రోజువారీ జీవితంలో ఏఐ వినియోగం భవిష్యత్తులో మరింతగా పెరగనుంది. చాట్ జీపీటీ టూల్ ఎంత సంచలనాలు సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. మరి ఏఐ మానవుల ఉద్యోగాలను పూర్తి స్థాయిలో భర్తీ చేస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

ఉద్యోగ మార్కెట్ పై ఏఐ ప్రభావం చూపిస్తుందంటూ ఇప్పటికే ఎంతో మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. కానీ, ఉద్యోగులు తమ బాధ్యతలను మెరుగ్గా నిర్వహించడంలో ఏఐ సహాయకారిగా ఉంటుందని కొందరు నిపుణులు పేర్కొన్నారు. మానవుల ఉద్యోగాలను ఏఐ పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై క్రెడ్ సీఈవో కునాల్ షా తన అభిప్రాయాన్ని ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు.

ఏఐ వల్ల 90 శాతం ఉద్యోగాలకు ముప్పు ఉన్నట్టు షా పేర్కొన్నారు. ‘‘ఏఐ వల్ల రిస్క్ ను ఇప్పటికైతే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారిలో 90 శాతం మందికి పదేళ్ల తర్వాత ఆ ఉద్యోగాలు ఉండకపోవచ్చు’’ అని కునాల్ షా వివరించారు. ఏఐ నైపుణ్యాలను నేర్చుకుని, ఏఐని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకున్న వారికి ఉద్యోగాలు ఎక్కడికీ పోవన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. నైపుణ్యాలు పెంచుకోవడమే అసలైన సవాలు అని, ప్రత్యేకమైన ఆసక్తి ఉంటే తప్ప ప్రతి ఒక్కరి ఉద్యోగానికి ముప్పు ఉన్నట్టేనని షా పేర్కొన్నారు. 

చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ సీఈవో శామ్ అల్ట్ మ్యాన్ సైతం లోగడ ఏఐ గురించి మాట్లాడుతూ.. మానవాళికి ఇది మంచి చేస్తుందని, వారికి ఇది అనుబంధంగా ఉంటుందున్నారు. అంతేకానీ వారి ఉద్యోగాలను ఇది భర్తీ చేయలేదన్నారు.


More Telugu News