విజయవాడ ఏసీబీ కోర్టు ముందు పోలీస్ కాన్వాయ్.. ఏంజరగబోతోంది?

  • భారీగా చేరుకున్న పోలీసు బలగాలు.. ఆందోళనలో టీడీపీ వర్గాలు
  • చంద్రబాబు అరెస్టుపై కోర్టులో కొనసాగుతున్న వాదనలు
  • టీడీపీ చీఫ్ రిమాండ్ కోసం సీఐడీ అధికారుల విజ్ఞప్తి
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్టుపై ఇరు పక్షాలు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కోర్టు బయట వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే అక్కడున్న పోలీసులకు తోడుగా అదనపు బలగాలు చేరుకున్నాయి. కోర్టు ముందు పోలీసులు భారీ కాన్వాయ్ మొహరించారు. ఓవైపు కోర్టులో విచారణ కొనసాగుతుండగానే బయట పోలీసులు చేస్తున్న హడావుడి చూసి ఏంజరగబోతోందని టీడీపీ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. అయితే, కోర్టు విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ముందు జాగ్రత్త చర్యగానే బలగాలను మోహరించినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ కేసు విచారణ కోసం చంద్రబాబును 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి అనుమతిస్తే చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. ఇందులో భాగంగానే కోర్టు ముందు భారీ కాన్వాయ్ ను మోహరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. విజయవాడలోని కోర్టు ఆవరణ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు ఉన్న వివిధ మార్గాలను క్లియర్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఓవైపు కోర్టులో వాదనలు జరుగుతుండడం, కోర్టు బయట పోలీసుల హడావుడి చూసి టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కోర్టు పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించకపోవడం, అరకిలోమీటరు దూరంలో బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


More Telugu News