కడిగిన ముత్యంలాగా చంద్రబాబు బయటకు వస్తారు: కన్నా లక్ష్మీనారాయణ

  • ఈ కేసు కోర్టులో నిలబడదన్న టీడీపీ సీనియర్ నేత
  • ప్రశ్నించిన వారిని వేధించడం జగన్ కు అలవాటేనని ఆరోపణ
  • ప్రజా కోర్టులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వం ఆయనపై పెట్టిన అక్రమ కేసులు కోర్టులో నిలబడవని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అంటూ తమ అధినేతపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈ కేసు విషయంలో సీఐడీ అధికారుల తీరుపై సందేహాలను లేవనెత్తారు. తొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరులేదని కన్నా లక్ష్మీనారాయణ గుర్తుచేశారు. తాజాగా కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో హడావుడిగా చంద్రబాబు పేరును చేర్చారని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ తప్పుడు కేసేనని, ప్రశ్నించిన వారిని కేసుల పేరుతో వేధించడం జగన్ కు అలవాటేనని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం టీడీపీ చీఫ్ పై కక్ష సాధిస్తోందని విమర్శించారు. ఈ వేధింపులకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని, ప్రజాకోర్టులో జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు.

జగన్ కు ప్రతీకారమే ముఖ్యం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ కక్ష సాధింపు రాజకీయాలకు వేదికగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కంటే కూడా జగన్ కు ప్రతీకార వాంఛ ముఖ్యమని విమర్శించారు. చంద్రబాబు అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని ఆయన తేల్చి చెప్పారు. దీనిపై సోమవారం మిగతా రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహిస్తామని వివరించారు. ఆ తర్వాత చంద్రబాబును కలిసి సంఘీభావం తెలపనున్నట్లు రామకృష్ణ వివరించారు.


More Telugu News