రియో జీ20కి పుతిన్ వస్తే అరెస్ట్ చేయబోం.. బ్రెజిల్ అధ్యక్షుడి అభయహస్తం

  • ఢిల్లీ జీ20 సదస్సుకు హాజరైన బ్రెజిల్ అధ్యక్షుడు
  • వచ్చే ఏడాది రియో జీ20కి పుతిన్‌ను  ఆహ్వానిస్తామన్న లులా
  • తాను బ్రెజిల్ అధ్యక్షుడిగా ఉండగా పుతిన్‌ను అరెస్ట్ చేయబోమని హామీ
వచ్చే ఏడాది రియో డి జెనీరోలో జరిగే జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అరెస్ట్ చేయబోమని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా అభయమిచ్చారు. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సుకు హాజరైన ఆయన ఓ ఇంటర్య్యూలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది తమ దేశంలో జరగనున్న జీ20 సమావేశాలకు పుతిన్‌ను ఆహ్వానిస్తామన్నారు. రియో సమావేశాలకు ముందు రష్యాలో జరగనున్న బ్రిక్స్ సమావేశాలకు తాను హాజరవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. 

‘‘పుతిన్ చాలా సులభంగా బ్రెజిల్ వెళ్లొచ్చు. నేనేం చెప్పదల్చుకున్నానంటే.. నేను బ్రెజిల్ అధ్యక్షుడినైతే ఆయన బ్రెజిల్ రావొచ్చు. ఆయనను అరెస్ట్ చేసే ప్రసక్తే లేదు’’ అని లులా స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చిలో పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్ నుంచి వందలాదిమంది చిన్నారులను  చట్టవిరుద్ధంగా, బలవంతంగా తరలించినట్టు పుతిన్ యుద్ధ నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ ఆరోపణలను రష్యా ఖండించింది. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాలకు పుతిన్ హాజరుకావాల్సి ఉండగా ఆయనకు బదులుగా విదేశాంగ మంత్రి సెర్గీ లారోవ్‌ను పంపించారు.


More Telugu News