అక్షరధామ్ దేవాలయాన్ని సందర్శించిన రిషి సునాక్ దంపతులు

  • ఆదివారం ఉదయం సతీసమేతంగా దైవదర్శనం చేసుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
  • సుమారు గంటపాటు రిషి సునాక్ దంపతులు ఆలయంలో గడిపే అవకాశం
  • రిషి దేవాలయ సందర్శన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు 
జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్ వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆదివారం సతీసమేతంగా దేశరాజధానిలో అక్షరధామ్ దేవాలయాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకున్నారు. రిషి సునాక్ దంపతులు అక్కడ సుమారు గంటమేర గడపనున్నారని సమాచారం.  

రాఖీ పండుగ ఘనంగా జరుపుకున్నానని రిషి సునాక్ ఇటీవలే పేర్కొన్నారు. అయితే, శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకునేందుకు తనకు తీరిక దొరకలేదని విచారం వ్యక్తి చేసిన ఆయన, ఇందుకు బదులుగా అక్షరధామ్ దేవాలయాన్ని సందర్శిస్తానని ఇటీవల మీడియాతో పేర్కొన్నారు. ఈ మేరకు నేటి ఉదయం ఆయన దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

కాగా, తాను హిందువైనందుకు గర్విస్తానంటూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గతంలో పలుమార్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ‘‘నేను హిందువై పుట్టినందుకు గర్విస్తున్నాను. మా తల్లిదండ్రులు నన్ను అలాగే పెంచారు’’ అని ఆయన గతంలో వ్యాఖ్యానించారు. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు రిషి సునాక్ దంపతులు శుక్రవారం ఢిల్లీకి వచ్చారు. నిన్నంతా రిషి జీ20 నేతలతో బిజీబిజీగా గడిపారు.


More Telugu News