శ్రీకృష్ణ జన్మాష్టమి.. మాజీ మహారాణిని గుడిలోంచి బయటకు గెంటేసిన పోలీసులు

  • మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోగల శ్రీ జుగల్ కిషోర్ దేవాలయంలో ఘటన
  • నిబంధనలు ఉల్లంఘించి గర్భగుడిలోకి వెళ్లేందుకు రాజకుటుంబ సభ్యురాలు, మాజీ మహారాణి జితేశ్వరీ దేవి ప్రయత్నం
  • ఆమె కాలు జారి కింద పడటంతో రభస మొదలైందని ఆలయ అధికారుల ఆరోపణ
  • పోలీసుల రంగ ప్రవేశం, మాజీ మహారాణిని బలవంతంగా బయటకు పంపించిన వైనం
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో గుడి నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలపై మధ్యప్రదేశ్ రాజకుటుంబ సభ్యురాలు, మాజీ మహారాణి జితేశ్వరీదేవిని పోలీసులు బలవంతంగా బయటకు పంపించేశారు. పన్నా జిల్లాలోని శ్రీ జుగల్ కిషోర్ గుడిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 

దేవాలయం సంప్రదాయం ప్రకారం ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అర్ధరాత్రి వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన జితేశ్వరీ దేవి వేడుకల్లో ఇబ్బందులు కలుగజేశారని ఆలయ అధికారులు ఆరోపించారు. తానే స్వయంగా హారతి ఇస్తానంటూ ఆమె పట్టుబట్టినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో ఆమె గర్భగుడిలోకి కూడా ప్రవేశించేందుకు ప్రయత్నించారన్నారు. 

చివరకు ఆమె కాలు జారి కిందపడటంతో నానా రభస జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మాజీ మహారాణి జితేశ్వరీ దేవిని దేవాలయం నుంచి బయటకు ఈడ్చేశారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, మద్యం మత్తులో దేవాలయానికి వచ్చిన జితేశ్వరీ దేవి ఆలయ అధికారులతో వాగ్వాదానికి దిగారని ఘటన సమయంలో అక్కడున్న వారు ఆరోపించారు. పోలీసులు జితేశ్వరీదేవిపై కేసు కూడా నమోదు చేశారు. 

ఇదిలా ఉంటే, జితేశ్వరీదేవి మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. డిఫెన్స్ వెల్ఫేర్ ఫండ్‌లోని 65 వేల కోట్ల నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. ఈ విషయంలో గొంతెత్తినందుకే తనను అరెస్టు చేశారని ఆరోపించారు.


More Telugu News