గవర్నర్‌తో టీడీపీ నేతల భేటీ రేపటికి వాయిదా

  • రేపు ఉదయం గం.9.45కు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతల బృందం
  • అచ్చెన్నాయుడి నేతృత్వంలో గవర్నర్‌తో భేటీ కానున్న టీడీపీ నేతలు
  • చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రేపు ఏపీ వ్యాప్తంగా నిరసనలు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ఆ పార్టీ నేతల భేటీ రేపటికి వాయిదా పడింది. తొలుత నేటి రాత్రి గం.7.30 సమయానికి కలవాలని నిర్ణయించారు. నాలుగు రోజుల పర్యటన కోసం నిన్న విశాఖ వచ్చిన గవర్నర్ విశాఖ పోర్ట్ అతిథి గృహంలో ఉన్నారు. అయితే ఈ రోజు గవర్నర్‌ను కలిసేందుకు కుదరకపోవడంతో ఆదివారం కలవనున్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై రేపు ఉదయం కలిసేందుకు అనుమతి ఇచ్చారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు చెప్పారు.

టీడీపీ నేతలు రేపు ఉదయం గం.9.45కు గవర్నర్‌తో భేటీ కానున్నారు. గవర్నర్‌ను కలిసే వారిలో అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాస్, గండి బాబ్జీ, దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు, కొండ్రు మురళీమోహన్, కోరాడ రాజుబాబు తదితరులు ఉన్నారు. అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారులు నిబంధనలు ఉల్లంఘించారని, గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఎఫ్ఐఆర్‌లో పేరులేని వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారని తెలుస్తోంది.

రేపు ఏపీవ్యాప్తంగా నిరసనలు

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. శాంతియుత ర్యాలీలు, నిరసనలు చేపట్టనున్నారు.


More Telugu News