టీమిండియాకు ఇదొక్కటే ఆందోళనకర అంశం: ఏబీ డివిలియర్స్

  • మరి కొన్నిరోజుల్లో భారత్ లో ఐసీసీ వరల్డ్ కప్
  • జట్టు పరంగా టీమిండియా ఎంపిక అద్భుతంగా ఉందన్న డివిలియర్స్
  • కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ లతో జట్టు బలంగా ఉందని వెల్లడి
  • అయితే, సొంతగడ్డపై ఒత్తిడి టీమిండియాకు సవాల్ గా మారుతుందని వ్యాఖ్యలు
క్రికెట్ అభిమానుల్లో క్రమంగా వరల్డ్ కప్ ఫీవర్ రాజుకుంటోంది. భారత్ లో అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు ఐసీసీ వరల్డ్ కప్ జరగనుంది. కొన్నిరోజుల కిందటే, వరల్డ్ కప్ లో ఆడే టీమిండియాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికరంగా స్పందించాడు. 

జట్టు పరంగా చూస్తే టీమిండియా ఎంపిక అద్భుతంగా ఉందని అన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాలతో  భారత జట్టు చాలా బలంగా ఉందని అభిప్రాయపడ్డాడు. 

అయితే తనకు టీమిండియా పరంగా ఆందోళన కలిగించే అంశం ఒక్కటే కనిపిస్తోందని, అది సొంతగడ్డపై ఆడుతుండడమేనని డివిలియర్స్ పేర్కొన్నాడు. సొంతగడ్డపై మెగా టోర్నీ ఆడుతుండడం భారత జట్టుకు బలహీనతగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. సొంత ప్రేక్షకుల మధ్య ఆడేటప్పుడు అంచనాలు భారీగా ఉంటాయని, ఆ అంచనాలు జట్టుపై తీవ్రమైన ఒత్తిడికి దారితీస్తాయని డివిలియర్స్ విశ్లేషించాడు. 

2011లో భారత్ సొంతగడ్డపైనే వరల్డ్ కప్ గెలిచిందని, ఇప్పుడా అంశం కూడా టీమిండియాకు భారంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ లో ఆడేటప్పుడు టీమిండియా నిర్భయంగా ఆడడమే ఒత్తిడికి విరుగుడు అని సూచించాడు.


More Telugu News