మొరాకోలో 1000 దాటిన భూకంప మృతుల సంఖ్య

  • గత రాత్రి మొరాకోలో భారీ భూకంపం
  • ఇప్పటివరకు 1,037 మంది మృతి
  • 1,200 మందికి గాయాలు
  • 6.8 తీవ్రతతో భూకంపం
ఆఫ్రికా దేశం మొరాకోను గత రాత్రి భారీ భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం ధాటికి మృతి చెందినవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 1,037 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం ధాటికి 1,200 మంది క్షతగాత్రులయ్యారని, గాయపడ్డవారిని ఆసుపత్రులకు తరలించినట్టు తెలిపారు. 

మరకేష్ వద్ద 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలను కలుగజేసింది. అధికారులు సహాయక చర్యల్లో శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. 

భూకంపం సృష్టించిన విలయం నేపథ్యంలో, ప్రజలు ఇళ్లలోకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. మరకేష్ ప్రాంతంలో చాలామంది రోడ్లపైనే కాలం గడుపుతున్నారు. 

మొరాకోలో గత 120 ఏళ్లలో ఇదే అతి పెద్ద భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.8 అనేది ఓ మోస్తరు తీవ్రతే అయినప్పటికీ, ఇక్కడి భవనాలు, ఇళ్లు పాతకాలం నాటివి కావడంతో నష్టం భారీగా జరిగింది.


More Telugu News