చంద్రబాబు అరెస్ట్ పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏమన్నారంటే...!

  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • ఈ కేసును విశ్లేషించిన లక్ష్మీనారాయణ
  • చంద్రబాబును తొలుత ఏసీబీ కోర్టులో హాజరుపర్చాల్సి ఉంటుందని వెల్లడి
  • సీఐడీ పిటిషన్ తిరస్కరణకు గురైతే చంద్రబాబు బెయిల్ దరఖాస్తు చేసుకోవచ్చని వివరణ
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ పై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఆయనపై మోపిన అభియోగాలకు సంబంధించిన సెక్షన్లను ఆయన విశ్లేషించారు. చంద్రబాబుపై నమోదు చేసిన కేసులోని కొన్ని సెక్షన్లు ఆయన అరెస్ట్ కు సంబంధించినవని, మరికొన్ని ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లు అని తెలిపారు. 

ఈ విధంగా అరెస్ట్ చేసిన తర్వాత సదరు వ్యక్తిని 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలని సీఆర్పీసీ చెబుతోందని అన్నారు. ఇందులో కరప్షన్ యాక్ట్  కూడా ఉంది కాబట్టి చంద్రబాబును మొదట ఏసీబీ కోర్టులో హాజరు పర్చాల్సి ఉంటుందని, ఆ తర్వాత సీఐడీ ఏం అడుగుతుందనేది చూడాల్సి ఉంటుందని వివరించారు. 

"చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరే అవకాశాలున్నాయి. సీఐడీ కస్టడీ పిటిషన్ తిరస్కరణకు గురైతే జడ్జి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు. అప్పుడు చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేసేందుకు వీలుంటుంది. 

ఇవాళ రిమాండ్ రిపోర్టులో ఏం రాశారన్నది జడ్జి పరిశీలించాక చంద్రబాబును సీఐడీ కస్టడీకి అప్పగించాలా? లేక జ్యుడిషియల్ కస్టడీ విధించాలా? అనే నిర్ణయం తీసుకుంటారు. జ్యుడిషియల్ కస్టడీ ఆర్డర్ వెలువడిన వెంటనే చంద్రబాబు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్టుల్లో జరిగే ప్రక్రియలు సాధారణంగా ఇలాగే ఉంటాయి. 

ఇక, సీఐడీ ప్రొసీడింగ్స్ కు, పోలీస్ ప్రొసీడింగ్స్ కు పెద్దగా తేడా ఉండదు. అయితే ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం సెక్షన్ ఉండడం వల్ల ప్రొసీడింగ్స్ మారిపోతాయి. చంద్రబాబును నేరుగా ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చాల్సి ఉంటుంది. 

ఇది ఆర్థికపరమైన అంశాలతో కూడిన కేసు కావడంతో సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా విచారించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయం కావడంతో అన్ని అంశాలను పరిశీలించి బెయిల్ ఇవ్వాలని, కారణాలన్నీ రాయాలని సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో స్పష్టంగా చెప్పింది" అని లక్ష్మీనారాయణ వివరించారు.


More Telugu News