సిట్ కార్యాలయానికి చంద్రబాబును తరలిస్తున్న పోలీసులు, ఆ తర్వాత కోర్టుకు!

  • మరికాసేపట్లో కుంచన్‌పల్లి సిట్ కార్యాలయానికి చంద్రబాబు
  • అక్కడే కోర్టుకు సబ్‌మిట్ చేసే ప్రక్రియను పూర్తి చేసి, వైద్య పరీక్షలు నిర్వహించనున్న పోలీసులు
  • 3వ అదనపు జిల్లా ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరిచే అవకాశం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును విజయవాడకు తరలించనున్నారని తెలుస్తోంది. అంతకుముందే కుంచన్‌పల్లిలోని సిట్ కార్యాలయానికి తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబును అరెస్ట్ చేసిన కాన్వాయ్ సాయంత్రం నాలుగు గంటల సమయంలో గుంటూరు ఆటో నగర్ మీదుగా విజయవాడ దిశగా వెళ్తోంది.

తొలుత తాడేపల్లిలోని కుంచన్‌పల్లి సిట్ కార్యాలయానికి తరలిస్తారని తెలుస్తోంది. ఇక్కడ కోర్టులో హాజరుపరిచేందుకు కావాల్సిన ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఆయన స్టేట్‌మెంట్ తీసుకొని, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 3వ అదనపు జిల్లా ఏసీబీ కోర్టుకు తరలించే అవకాశముంది. కుంచన్‌పల్లిలో చంద్రబాబు కాన్వాయ్ మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, చంద్రబాబును తీసుకువస్తారని భావించి విజయవాడ సిటీ కోర్టు కాంప్లెక్స్‌కు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వైపు వెళ్లే రహదారిని పోలీసులు మూసివేశారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఏపీ సీఐడీ చంద్రబాబును మొదటి ముద్దాయిగా పేర్కొంది. ప్రజాధనం దుర్వినియోగమైనట్లు పేర్కొంది.


More Telugu News