భూకంపం వచ్చిన సమయంలో పరుగులు పెడుతున్న ప్రజలు.. ఇదిగో వీడియో

  • మొరాకోలో ఘోర భూకంపం 
  • ఇప్పటి వరకు 632 మంది దుర్మరణం
  • శిథిలాల కింద పెద్ద సంఖ్యలో చిక్కుకున్నారన్న సందేహాలు
మొరాకోలో ఘోర భూకంపం సంభవించింది. సుమారు 632 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది. సుమారు 329 మంది వరకు గాయపడినట్టు భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఈ భూకంపం రాగా, రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైంది. భూకంపం వచ్చిన సమయంలో ప్రకంపనలకు ప్రజలు భయపడి పరుగులు తీశారు. ఇళ్లల్లో ఉన్న వారు బయటకు పరుగులు తీయగా, కొందరు భయంతో వీధుల్లోంచి ఇళ్లల్లోకి పారిపోతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.

భవనాలు కదిలిపోవడం, శిథిలాలు కూలిపోవడం వీడియోల్లో కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లోకి చేరాయి. భూకంపం ధాటికి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఉన్న వాటికి కూడా నష్టం వాటిల్లింది. పర్వత ప్రాంతంలోని ఇఘిల్ పట్టణానికి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. భూమి పొరల్లో 18.5 కిలోమీటర్ల లోతు నుంచి ఇది ఏర్పడినట్టు భావిస్తున్నారు. 

యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం శుక్రవారం రాత్రి 11.11 గంటలకు ఈ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7 గా వచ్చినట్టు మొరాకో నేషనల్ సీస్మెక్ మానిటరింగ్ విభాగం ప్రకటించింది. శిథిలాల కింద పెద్ద సంఖ్యలో జనం చిక్కుకుని ఉండొచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి.


More Telugu News