సాయం చేసేందుకు సిద్ధం.. మొరాకో భూకంపంపై ప్రధాని మోదీ స్పందన

  • భూకంపానికి ప్రజలు బలికావడంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
  • బాధిత కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా సంతాపం
  • క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు పోస్ట్
  • చేయగలిగిందంతా చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటన   
మొరాకోలో శుక్రవారం సంభవించిన భూకంపంలో అనేక మంది మరణించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారత్ అన్ని రకాలుగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. 

‘‘మొరాకో భూకంపం అనేక మందిని బలిగొనడం విచారకరం. ఈ కష్ట సమయంలో బాధితుల క్షేమం కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని మోదీ పోస్ట్ చేశారు. ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. గాయపడ్డవారు కోలుకోవాలని, ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు చేయగలిగిందంతా చేసేందుకు భారత్ రెడీగా ఉందని భరోసా కల్పించారు. 

స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మొరాకోలోని అట్లాస్ పర్వత శ్రేణుల్లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. అనేక భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటివరకూ 296 మంది మరణించారు. అనేక మంది ప్రాణభయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకూ 153 మంది గాయపడ్డ వారిని గుర్తించినట్టు దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.


More Telugu News