ఇంతకంటే సిగ్గుచేటు మరోటి ఉండదు.. భారత్-పాక్‌ మ్యాచ్‌కు రిజర్వ్ డేపై వెంకటేశ్ ప్రసాద్ మండిపాటు

  • వర్షం కారణంగా గ్రూప్ దశలో తుడిచిపెట్టుకుపోయిన భారత్-పాక్ మ్యాచ్
  • రేపటి మ్యాచ్‌కు రిజర్వు డే ప్రకటించిన ఏసీసీ
  • ఇది పూర్తిగా అనైతికమన్న వెంకటేశ్ ప్రసాద్
  • రెండు జట్లకు వేర్వేరు నిబంధనలు ఏంటని మండిపాటు
  • తమకూ రిజర్వ్ డే కావాలన్న బంగ్లాదేశ్
ఆసియాకప్‌లో భాగంగా భారత్-పాక్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు రిజర్వ్ డే ప్రకటించడంపై టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ తీవ్రస్థాయిలో ఫైరయ్యాడు. సూపర్-4 లో భాగంగా రేపు (ఆదివారం) కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ దశలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన నేపథ్యంలో రేపటి మ్యాచ్‌కు ఏసీసీ రిజర్వు డేను ప్రకటించింది. ఆదివారం కనుక వర్షం కురిసి మ్యాచ్ ఆగిపోతే సోమవారం మ్యాచ్ ఆగిన దగ్గరి నుంచి తిరిగి ప్రారంభిస్తారు.  

జైషా సారథ్యంలోని ఏసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై వెంకటేశ్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం ఈ మ్యాచ్‌కు మాత్రమే ఎందుకని, రెండు జట్లకు వేర్వేరు నిబంధనలు ఉండడం అనైతికమని మండిపడ్డాడు. ఇది పూర్తిగా సిగ్గులేని తనమేనని దుమ్మెత్తి పోశాడు. ఇలాంటి హానికరమైన ప్రణాళికలు విజయవంతం కావంటూ ఎక్స్ చేశాడు. రెండోరోజూ వర్షం కురిస్తే అప్పుడేం చేస్తారని ప్రశ్నించాడు. 

భారత్-పాక్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే ప్రకటించడాన్ని బంగ్లాదేశ్ హెడ్‌కోచ్ చండిక హతురుసింఘ కూడా తప్పుబట్టాడు. కొలంబోలో వర్షం వచ్చే అవకాశం ఉంది కాబట్టి తమకు కూడా రిజర్వు డే కావాలని డిమాండ్ చేశాడు.


More Telugu News