చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు లోకేశ్ యత్నం... పోలీసులు అడ్డుకోవడంతో వర్షంలోనే నిరసన

  • నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్
  • భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు
  • పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ విషయం తెలియడంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. వెంటనే చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. 

అయితే, చంద్రబాబు వద్దకు వెళ్ళకూడదు అంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎలాంటి నోటీసులు లేకుండా లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం పట్ల టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నోటీసులు ఏవని అడిగితే పోలీసులు డీఎస్పీ వస్తారు అని సమాధానం చెబుతున్నట్టు తెలుస్తోంది. లోకేశ్ వద్దకు మీడియాను కూడా అనుమతించడంలేదని సమాచారం. 

ఈ నేపథ్యంలో నారా లోకేశ్ వర్షంలోనే తన క్యాంప్ సైట్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. లోకేశ్ భద్రతాధికారి జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారు. స్థానిక పోలీసు అధికారులు వచ్చి మాట్లాడతారని ఎస్పీ బదులిచ్చారు. పోలీసుల తీరు పట్ల టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.


More Telugu News