హత్యకు గురైన టీడీపీ కార్యకర్త నాగరాజు కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు

  • పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త హత్య
  • పొలంలో పనిచేసుకుంటున్న నాగరాజును నరికి చంపిన వైనం
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • హత్యా రాజకీయాలకు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా మారిందని విమర్శలు
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో నాగరాజు అనే టీడీపీ కార్యకర్త దారుణ రీతిలో హత్యకు గురయ్యాడు. నాగరాజు స్వస్థలం లింగాల మండలం అంబకపల్లె. పొలంలో పనిచేసుకుంటున్న నాగరాజును వేటకొడవళ్లతో నరికి చంపారు. 

పార్టీ మారాలని కొన్నిరోజులుగా వేధిస్తున్నారని నాగరాజు కుటుంబ సభ్యులు వాపోయారు. ఇటీవల చంద్రబాబు పులివెందుల వచ్చినప్పుడు నాగరాజు టపాసులు పేల్చాడని, దాంతో అతడిపై కక్షగట్టారని ఆరోపించారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, హతుడు నాగరాజు కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ ద్వారా పరామర్శించారు. సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త హత్యకు గురికావడాన్ని ఆయన ఖండించారు. నాగరాజు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నాగరాజు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీ హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని మండిపడ్డారు. పార్టీ మారకపోతే మనుషులను చంపేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగరాజును హత్య చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

హత్యా స్థలాన్ని పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి పరిశీలించారు. నాగరాజు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.


More Telugu News