భారత్ లో జీ20 శిఖరాగ్ర సమావేశాలకు సర్వం సిద్ధం

  • ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జీ20 సదస్సు
  • తరలివస్తున్న ప్రపంచ దేశాధినేతలు
  • దేశ రాజధానిలో అత్యంత కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు
  • శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణకు 40 వేల మంది నియామకం
  • ఢిల్లీలో ఈ నెల 10 వరకు ఆంక్షలు
ఈ ఏడాది జీ20 కూటమి శిఖరాగ్ర సమావేశాలకు భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో రేపు, ఎల్లుండి జీ20 సదస్సు జరగనుంది. ఈ ప్రపంచస్థాయి సదస్సుకు ఢిల్లీ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ సదస్సు కోసం ఢిల్లీ ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలో అట్టహాసంగా వేదిక నిర్మించారు. 

ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో దేశాధినేతలు హాజరుకానున్నారు. సభ్య దేశాలతో పాటు 11 ప్రత్యేక ఆహ్వానిత దేశాధినేతలు కూడా ఈ సదస్సుకు విచ్చేస్తున్నారు. అంతేకాదు, ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు అధినేతలు కూడా జీ20 శిఖరాగ్ర సమావేశాలకు హాజరవుతున్నారు. 

పలువురు దేశాధినేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. జీ20 సదస్సు కోసం బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్ట్ ఫెర్నాండెజ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు. కాగా, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఢిల్లీలోని షాంగ్రి-లా హోటల్ లో బస చేయనున్నారు. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ సాయంత్రానికి ఢిల్లీ చేరుకోనున్నారు. ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ గైర్హాజరవుతున్న సంగతి తెలిసిందే. 

కాగా, ఈ జీ20 సదస్సు అజెండాలో... అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాల పెంపు, అంతర్జాతీయ రుణ నిర్వాహణ సరళీకరణ, క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ, వాతావరణ మార్పులు-పర్యావరణ పరిరక్షణ తదితర కీలక అంశాలు ఉన్నాయి. 

వివిధ దేశాధినేతల రాక సందర్భంగా ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ విధుల నిర్వహణ కోసం ఢిల్లీలో 40 వేల మంది అదనపు సిబ్బందిని నియమించారు. 

డ్రోన్ దాడులను తిప్పికొట్టేలా కౌంటర్ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. డమ్మీ పేలుడు పదార్థాలపై శునకాలతో డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. యమునా నదిలోనూ బోట్లతో పోలీసులు పెట్రోలింగ్ చేపట్టారు. అదే సమయంలో, ఢిల్లీలో నిఘా కోసం ఎన్ఎండీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసింది. 

ఢిల్లీలోని కర్తవ్యపథ్, ఇండియా గేట్, తదితర కీలక ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. దేశ రాజధానికి విమానాల రాకపోకలు, మెట్రో రైళ్లపై ఆంక్షలు విధించారు. కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆహార సంస్థలను కూడా ఆంక్షల పరిధిలోకి తీసుకువచ్చారు. ఢిల్లీలో ఈ నెల 10 వరకు కేంద్ర కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.


More Telugu News