కేరళలో మాజీ సీఎం కుమారుడి విజయకేతనం

  • కాంగ్రెస్ అభ్యర్థి చాందీ ఊమెన్ కు భారీ మెజారిటీ
  • 36,454 ఓట్లతో సీపీఎం అభ్యర్థిపై గెలుపు
  • తండ్రి ఊమెన్ చాందీ రికార్డును తిరగరాసిన చాందీ ఊమెన్
కేరళ మాజీ సీఎం, దివంగత కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీ కుమారుడు, చాందీ ఊమెన్ పుత్తుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి 36,454 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చాందీ ఊమెన్ కు మొత్తం 78,098 ఓట్లు పోలయ్యాయి. సీపీఎం అభ్యర్థి థామస్ కు 41,644 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి లిగిన్ లాల్ 6,447 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. పుత్తుపల్లి స్థానంలో చాందీ ఊమెన్ మెజారిటీ పరంగా కొత్త రికార్డు నమోదు చేశారు. ఈ నియోజకవర్గ చరిత్రలో ఇంత అత్యధిక మెజారిటీతో గెలిచిన నేతగా చాందీ ఊమెన్ నిలిచారు. 2011లో తన తండ్రి ఊమెన్ చాందీ సాధించిన 33,000 ఓట్ల మెజారిటీని అధిగమించారు.

ఈ ఫలితాలపై కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ స్పందిస్తూ.. ‘‘ఈ ఫలితాలు ఊహించినవే. ఎందుకంటే పుత్తుపల్లి ప్రజలు వారిని (అధికార పార్టీ) శిక్షించేందుకు వేచి చూశారు. తాము చేసిన దానికి సీపీఎం రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. పుత్తుపల్లి ప్రజలు బీజేపీ, సీపీఎంను విసిరికొట్టారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల వ్యాఖ్యానించారు.


More Telugu News