మూడ్రోజులు బిజీ బిజీగా మోదీ.. 15కి పైగా ద్వైపాక్షిక సమావేశాల ఏర్పాటు

  • రేపు, ఎల్లుండి న్యూఢిల్లీ జీ20 శిఖరాగ్ర సదస్సు
  • హాజరు కానున్న పలు దేశాల అధినేతలు
  • నేటి నుంచి పలు దేశాల నేతలతో చర్చలు జరపనున్న మోదీ
భారత్ అధ్యక్షతన రేపు, ఎల్లుండి న్యూఢిల్లీలో జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు భారత్ తొలిసారి నాయకత్వం వహిస్తోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు జీ20 దేశాల అధినేతలు భారత్ కు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి మూడో రోజుల పాటు బిజీ బిజీగా గడపనున్నారు. పలువురు ప్రపంచ నేతలతో మోదీ 15కి పైగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ రోజు ప్రధాని మోదీ తన నివాసంలో మారిషస్, బంగ్లాదేశ్, అమెరికా నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. రేపు జీ20 సదస్సులో పాల్గొనడంతో పాటు యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాలకు చెందిన నేతలతో చర్చలు జరుపుతారు. ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో లంచ్- మీటింగ్ లో పాల్గొంటారు. 

కెనడా, కొమొరోస్, టర్కీ, యూఏఈ, దక్షిణ కొరియా, ఈయూ/ఈసీ, బ్రెజిల్, నైజీరియా దేశాల నేతలతో కూడా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్  హసీనా తన కుమార్తె సైమా వాజెద్‌తో కలిసి వచ్చే అవకాశం ఉంది.  త్రిపురతో రైలు మార్గాన్ని, రాంపాల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్‌ను ప్రధాని మోదీతో కలిసి హసీనా ప్రారంభించనున్నారు. రెండు దేశాల పౌరులు ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు డాలర్లలో కాకుండా స్థానిక కరెన్సీలో చెల్లించేందుకు రూపే-టాకా కార్డును సులభతరం చేసే ఒప్పందంతో సహా పలు ఒప్పందాలపై ఆమె సంతకం చేయనున్నారు.


More Telugu News