డీఎస్సీ నోటిఫికేషన్.. తెలంగాణలో 5 వేల టీచర్ పోస్టుల భర్తీ

  • ఈ నెల 6న నోటిఫికేషన్ జారీ.. బయటకు వెల్లడించని అధికారులు
  • ఈ నెల 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • నవంబర్ 20 నుంచి డీఎస్సీ పరీక్ష నిర్వహణ
తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,089 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల చేసినా.. అధికారులు తాజాగా బయటపెట్టారు. డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా ఈ నెల 20 నుంచి వచ్చే నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని, ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 

తెలంగాణ డీఎస్సీ పరీక్ష 2023 నవంబర్ 20 నుంచి 30 వరకు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ లో మొత్తం 5,089 పోస్టులు భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో 2,575 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, 1,739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 611 భాషా పండితుల పోస్టులు, 164 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఉన్నట్లు తెలిపింది. కాగా, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి బీఈడీ, డీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణతతో పాటు టెట్ లోనూ అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులని పేర్కొంది. వయో పరిమితి 18 నుంచి 44 ఏళ్లు.. ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులు రూ.1,000 ఫీజు చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.


More Telugu News