రెండు నెలలకే యూటర్న్.. బీజేపీతో పొత్తుకు దేవెగౌడ రెడీ

  • ఒంటరిగానే పోటీచేస్తామని రెండు నెలల క్రితం చెప్పిన జేడీఎస్ సుప్రీం లీడర్ దేవెగౌడ
  • వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు సై
  • ఐదు స్థానాలు కోరుతున్న జేడీఎస్
కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి ముందుకు సాగాలని బీజేపీ నిర్ణయించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ ఇటీవల బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమై కూటమి నిర్మాణంపై చర్చించారు. తమకు ఐదు లోక్‌సభ స్థానాలు ఇవ్వాలని దేవెగౌడ కోరినట్టు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే దేవెగౌడ, కుమారస్వామి ఈ ప్రతిపాదనను బీజేపీ ముందు ఉంచినట్టు తెలుస్తోంది.

జేడీఎస్ అడుగుతున్న స్థానాల్లో మాండ్యా, హసన్, తుముకూరు, చిక్‌బళ్లాపూర్, బెంగళూరు రూరల్ ఉన్నాయి. జులైలో దేవెగౌడ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేతో పొత్తుపెట్టుకునే ఆలోచన లేదని, లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. తాము ఐదు స్థానాల్లో గెలుస్తామా? ఒక స్థానంతో సరిపెట్టుకుంటామా? అన్నది తర్వాతని, ఒంటరిగానే పోటీ చేస్తామని పేర్కొన్నారు. అంతలోనే బీజేపీతో చేతులు కలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.  కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలున్నాయి. 2019లో బీజేపీ 25 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, జేడీఎస్ చెరో స్థానంలో గెలవగా, బీజేపీ మద్దతుతో మరో అభ్యర్థి గెలుపొందాడు.


More Telugu News