ఉస్మానియా ఆసుపత్రి ముందు హోంగార్డు భార్య ఆందోళన

  • తన భర్తది ఆత్మహత్య కాదని ఉన్నతాధికారులు చేసిన హత్య అని ఆరోపణ
  • ఏఎస్సై నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందులను అరెస్టు చేయాలని డిమాండ్
  • తన పిల్లలకు న్యాయం చేయాలని కుటుంబంతో కలిసి ఆసుపత్రి ముందు బైఠాయింపు
  • హోంగార్డులకు ఉన్నతాధికారుల హెచ్చరికలు
ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చేరిన హోంగార్డు రవీందర్ శుక్రవారం తెల్లవారుజామున చనిపోయారు. పోలీసులు ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్న హోంగార్డు రవీందర్ భార్య సంధ్య.. తన పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రి ముందు బైఠాయించారు. 

తన భర్తది ఆత్మహత్య కాదని, ఉన్నతాధికారులు చేసిన హత్య అని ఆరోపించారు. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలంటూ ఆమె డిమాండ్ చేశారు. పదిహేడేళ్లుగా నిబద్ధతతో పనిచేసిన తన భర్తను వేధించి, ఆత్మహత్య చేసుకునేలా చేశారంటూ రోదించారు. తన భర్త ఫోన్ ను తీసుకున్న పోలీసులు దానిని అన్ లాక్ చేసి, అందులోని డాటా మొత్తాన్నీ తొలగించారని సంధ్య ఆరోపించారు. ఏఎస్సై నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హోంగార్డులకు ఉన్నతాధికారుల వార్నింగ్
హోంగార్డు రవీందర్ చనిపోవడంతో ఆయన కుటుంబానికి మద్దతుగా హోంగార్డులు ఎవరూ వెళ్లకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. హోంగార్డులు అందరూ తమ తమ విధుల్లోనే ఉండాలని, విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈమేరకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల బాధ్యతలను ఎస్సైలకు అప్పగించారు. హోంగార్డులు అందరూ విధులకు హాజరయ్యేలా, విధులు కేటాయించని వారంతా పోలీస్ స్టేషన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


More Telugu News