బొమ్మలోని 50 మాగ్నెట్స్ మింగి బాలుడి నరకయాతన.. ఆపరేషన్‌ చేసి కాపాడిన వైద్యులు

  • 48 గంటల పాటు తీవ్ర కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖమ్మం జిల్లాకు చెందిన బాలుడు
  • సకాలంలో ఆపరేషన్ చేసి ప్రాణాపాయం తప్పించిన విజయవాడకు చెందిన ప్రైవేటు ఆసుపత్రి
  • మాగ్నెట్ బాల్స్ తో తయారైన బొమ్మలతో ఇలాంటి ప్రమాదం ఉందంటున్న వైద్యులు
బొమ్మలు ఇచ్చేసి ఆడుకొమ్మని చెప్పి చిన్న పిల్లలను పట్టించుకోకపోతే ఎంత ప్రమాదమో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. ఖమ్మం జిల్లాకు చెందిన ఏడేళ్ల నేహన్‌ తల్లిదండ్రులు తనకు ఇచ్చిన బొమ్మలతో ఆడుకుంటూ వాటిలో ఉన్న చిన్నపాటి మాగ్నెట్స్ (అయస్కాంత గోళాలు) మింగాడు. దాంతో తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దాదాపు రెండు రోజుల పాటు తీవ్రమైన కడుపు నొప్పితో నరకయాతన పడ్డాడు. దాంతో తల్లిదండ్రులు విజయవాడలోని ఓ ప్రయివేటు దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చిన్నారికి స్కాన్ చేసిన నిర్వహించిన వైద్యులు కడుపులో మాగ్నెట్స్ గుర్తించి అవాక్కయ్యారు. 

సమయానికి ఆపరేషన్ నిర్వహించి వాటిని బయటకు తీసి ఆ చిన్నారి ప్రాణాలు కాపాడారు. మాగ్నెట్ బాల్స్ తో తయారైన ఆట బొమ్మలతో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. బొమ్మల్ని నోట్లో పెట్టుకున్నప్పుడు మాగ్నెట్స్ చిన్న పిల్లలు మింగే అవకాశముందన్నారు. ఇలాంటి ఘటనల్లో సమయానికి ఆపరేషన్‌ చేయకపోతే ప్రాణపాయ పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాబట్టి బొమ్మలతో ఆడుకునే చిన్నారులపై ఓ కన్నేసి ఉంచాలి. నోట్లోకి వెళ్లే విడిభాగాలు లేని బొమ్మలను ఇస్తే మంచిది.


More Telugu News