ఎక్కువ మాట్లాడితే చంద్రయాన్-4లో చంద్రుడి మీదకు పంపిస్తా.. కూర్చో!: మహిళపై విరుచుకుపడిన హర్యానా సీఎం.. వీడియో ఇదిగో

  • ఓ బహిరంగ సభలో సీఎం వ్యాఖ్యలు
  • ఫ్యాక్టరీ కట్టిస్తే తమలాంటి వారందరికీ ఉపాధి లభిస్తుందన్న మహిళ
  • సీఎం వ్యాఖ్యలతో విరగబడి నవ్విన జనం
  • అవమాన భాారంతో కూర్చున్న మహిళ
  • విరుచుకుపడుతున్న ప్రతిపక్షాలు
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కోసం ప్రశ్నించిన మహిళను చంద్రుడిపైకి పంపిస్తానని, చంద్రయాన్-4ను అభివృద్ధి చేస్తున్నది మీలాంటి వాళ్ల కోసమేనని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సీఎం తీరుపై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

ఓ బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తుండగా ఓ మహిళ లేచి ఫ్యాక్టరీలు కట్టిస్తే తమలాంటి వారందరికీ ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ఆ మాటలకు ఖట్టర్ తీవ్రస్థాయిలో మండిపడడమే కాకుండా ఆమెను అవమానించేలా మాట్లాడారు. ‘‘వచ్చేసారి చంద్రయాన్-4లో నిన్ను చంద్రుడిపైకి పంపుతా. కూర్చో.. కూర్చో’’ అంటూ దారుణంగా అవమానించారు. ఆయన వ్యాఖ్యలకు అందరూ విరగబడి నవ్వారు. దీంతో మహిళ అవమానభారంతో మరోమాట మాట్లాడకుండా కూర్చుంది. 

వీడియో వైరల్ కావడంతో సీఎంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికైన వ్యక్తి ఇలా బహిరంగంగా మహిళలను అవమానించడం ఏంటని ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి కోసం ఫ్యాక్టరీ అడగడమే ఆమె చేసిన నేరమా? అని ప్రశ్నించింది. మహిళలపై బీజేపీకి, ఆరెస్సెస్‌కు ఏమాత్రం గౌరవం లేదని మరోమారు తేలిపోయిందని కాంగ్రెస్ విరుచుకుపడింది. సీఎం సిగ్గుపడాలని విమర్శించింది.


More Telugu News