హైదరాబాద్ లో నేడే డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్.. ఎక్కడ, ఎప్పుడంటే..!

  • గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రాత్రి 7.30 నుంచి పోటీలు
  • బరిలోకి జాన్ సేనా, విన్సీ, కైసర్ సహా 28 మంది రెజ్లర్లు
  • హాట్ కేకుల్లా అమ్ముడైన అన్ని టికెట్లు
ఇన్నాళ్లూ విదేశాల్లో జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్) పోరాటాలను టీవీల్లో చూసిన హైదరాబాద్ అభిమానులకు వీటిని ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశం ఇప్పుడు లభించింది. హైదరాబాద్ వేదికగా ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలు జరగనున్నాయి. గచ్చిబౌలి స్టేడియం వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్పెక్టాకిల్‌ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని పొందిన డబ్ల్యూడబ్ల్యూఈలో ఈసారి భారత రెజ్లర్లతో పాటు వేర్వేరు దేశాలకు చెందిన ప్రముఖ రెజ్లర్లు 28 మంది బరిలో నిలిచారు. పలు టైటిళ్లు కొల్లగొట్టిన జాన్‌సేనా..ఫ్రీకిన్‌ రోలిన్స్‌ జతగా బరిలోకి దిగుతున్నాడు. వీరిద్దరు గివోని విన్సీ, లుడ్విగ్‌ కైసర్‌తో తలపడనున్నారు. 

డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్‌ టీమ్‌ టైటిల్‌ కోసం ఇండస్‌ షేర్‌( సంగా, వీర్‌), కెవిన్‌ ఒవెన్స్‌, సమి జైన్‌ మధ్య ఫైట్‌ జరుగుతుంది. మహిళల డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్‌ టైటిల్‌ కోసం నటాల్యతో రియా రిప్లే అమీతుమీ తేల్చుకోనుంది. వీరితో పాటు డ్రూ మెక్‌లెట్రీ, షాంకీ, రింగ్‌ జనరల్‌ గుంతర్‌, జియోనీ విన్సీ కూడా బరిలో దిగనున్నారు. ఈ ఈవెంట్ కోసం బుక్ మై షోలో టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. పోటీ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. దాంతో, దాదాపు నాలుగు వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం మొత్తం నిండిపోనుంది. ఈ పోటీలను సోనీ స్పోర్ట్స్ చానళ్లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.


More Telugu News