ఆసియా కప్​లో పాకిస్థాన్​ హవా.. బంగ్లా పని పట్టి భారత్‌తో పోరుకు సై​

  • సూపర్4 తొలి మ్యాచ్‌లో బంగ్లాపై 7 వికెట్లతో నెగ్గిన పాక్
  • చెలరేగిన పేసర్లు హారిస్ రవూఫ్, నసీమ్ షా
  • అర్ధశతకాలతో రాణించిన ఇమామ్, రిజ్వాన్
ఆసియా కప్‌లో ఆతిథ్య పాకిస్థాన్ హవా కొనసాగుతోంది. ముఖ్యంగా ఆ జట్టు పేసర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. హారిస్‌ రవూఫ్ (4/19), నసీమ్‌ (3/34) షా నిప్పులు చెరగడంతో సూపర్‌-4 ఆరంభ మ్యాచ్‌లో పాక్‌ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఈ టోర్నీలో తమ సొంతగడ్డపై చివరి మ్యాచ్‌ ఆడిన పాక్‌ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 38.4 ఓవర్లలో 193 పరుగులకు కుప్పకూలింది. పాక్‌ పేస్‌ త్రయం రవూఫ్, నసీమ్, షహీన్‌ షా (1/42) బంగ్లా వెన్నువిరిచారు. 

కెప్టెన్‌ షకీబ్ అల్ హసన్  (53), ముష్ఫికర్‌ రహీమ్ (64) ఆచితూచి ఐదో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా చివర్లో పాక్ బౌలర్లు మరోసారి విజృంభించడంతో బంగ్లా కనీసం 200 మార్కు కూడా దాటలేకపోయింది. అనంతరం  స్వల్ప లక్ష్యాన్ని పాకిస్థాన్‌ 39.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (20), కెప్టెన్ బాబర్‌ ఆజమ్‌ (17) నిరాశ పరిచినా.. ఇమామ్‌ ఉల్‌ హక్‌ (78), మొహమ్మద్ రిజ్వాన్‌ (63 నాటౌట్‌) అర్ధ శతకాలతో సత్తా చాటడంతో పాకిస్థాన్‌ సులువుగా గెలిచింది. రవూఫ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. పాక్ ఆదివారం జరిగే తన తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో పోటీ పడనుంది.


More Telugu News