డీఎంకే ఎంపీ రాజా వ్యాఖ్యలకు తమిళిసై కౌంటర్

  • డీఎంకే పార్టీలోనే సమానత్వం లేదన్న తెలంగాణ గవర్నర్
  • పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వరని విమర్శ
  • కులాలు వద్దంటూ కుల రిజర్వేషన్లు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్న
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీలోనే సమానత్వం లేదని, కరుణానిధి కుటుంబమే అందులో పదవులు అనుభవిస్తున్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరోపించారు. సమానత్వం గురించి మాట్లాడే ముందు తమ పార్టీలో పరిస్థితిని చూసుకోవాలని డీఎంకే నేత, ఎంపీ రాజాకు హితవు పలికారు. దశాబ్దాల పాటు పార్టీ కోసం పాటుపడిన వారికి మొండిచెయ్యి చూపించి స్టాలిన్ తన కొడుకుకు మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శించారు. ఈమేరకు డీఎంకే ఎంపీ రాజా వ్యాఖ్యలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై తాజాగా స్పందించారు.

సనాతన ధర్మం వల్ల అందరికీ సమాన అవకాశాలు దక్కడంలేదని ఎంపీ రాజా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై తమిళిసై మండిపడ్డారు. డీఎంకే పార్టీలో కీలక పదవుల్లో కరుణానిధి కుటుంబ సభ్యులే ఉన్నారని ఆరోపించారు. పార్టీలో సీనియర్లు, పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన వాళ్లు ఉండగా ఉదయనిధి స్టాలిన్ కు కీలక పదవులు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. ఇందులో సమానత్వం ఎక్కడుందని నిలదీశారు. ముందు మీ పార్టీలో సమానత్వం పాటించి ఆ తర్వాత సమానత్వం గురించి మాట్లాడాలని చెప్పారు. కులాలు వద్దంటూ తమిళనాడులో కుల ఆధారిత రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తున్నారని తమిళిసై ప్రశ్నించారు.


More Telugu News