వాంతితో తడిసిన సీట్లలో కూర్చోబోమన్న ప్రయాణికులను కిందకు దించేసిన పైలట్

  • ఎయిర్ కెనడా ఎయిర్‌లైన్స్‌లో వెలుగు చూసిన ఘటన
  •  శుభ్రమైన సీట్లు కేటాయించాలని ఇద్దరు ప్రయాణికులు కోరగా ఖాళీలేవని చెప్పిన సిబ్బంది
  • సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం, ఇద్దరినీ కిందకు దించేసిన పైలట్
  • ఘటనపై స్పందించిన ఎయిర్ కెనడా, నిబంధనల ఉల్లంఘన జరిగిందని అంగీకారం
ఎయిర్ కెనడా ఎయిర్‌లైన్స్ లో ఓ ఇద్దరు ప్రయాణికులకు తాజాగా దారుణ అనుభవం ఎదురైంది. వాంతితో తడిసిన సీట్లలో కూర్చోబోమన్నందుకు వారిని పైలట్ విమానం నుంచి దించేశారు. సియాటెల్ నుంచి మాంట్రియాల్‌కు వెళ్లే విమానంలో జరిగిన ఈ దారుణం గురించి మరో ప్రయాణికుడు బెన్సన్ ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికలో పంచుకున్నారు. 

ఆ సీట్ల నుంచి దుర్వాసన వచ్చిందని, అదేంటో మొదట తమకు అర్థం కాలేదని బెన్సన్ చెప్పారు. అంతకుముందు ఆ సీట్లలో కూర్చున్న వారెవరో వాంతి చేసుకుని ఉంటారని, దాన్ని కప్పిపుచ్చేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని తెలిపారు. సీట్లు తడిగా ఉండటంతో పాటు వాటి పక్కను వాంతి మరకలు ఉన్నాయని చెప్పారు. వాసన రాకుండా ఉండేందుకు సిబ్బంది అక్కడ సెంటుకొట్టారని ఆరోపించారు. 

ఆ సీట్లలో కూర్చోటానికి వీలులేకుండా ఉండటంతో ఆ ఇద్దరు ప్రయాణికులు తమకు వేరే సీట్లు కేటాయించాలని సిబ్బందిని కోరారు. తమ సమస్యను మర్యాదగానే చెప్పినా నిక్కచ్చిగా వ్యవహరించారని బెన్సన్ తెలిపారు. కానీ, ఈ విషయంలో తామేమీ చేయలేమని ఫ్లైట్ అటెండెంట్లు నిస్సహాయత వ్యక్తం చేశారు. మిగతా సీట్లలో ప్యాసెంజర్లు ఉన్నారని పేర్కొన్నారు. 

ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం మొదలు కావడంతో జోక్యం చేసుకున్న పైలట్ విమానం దిగిపోవాలని ఆ ఇద్దరినీ ఆదేశించాడు. లేకపోతే మరో విమానంలోనే ప్రయాణించేందుకు వీల్లేకుండా వారిని ‘నో ఫ్లై’ జాబితాలో చేర్చుతానని హెచ్చరించాడు. మరోదారి లేకపోవడంతో ఆ ఇద్దరు విమానం నుంచి దిగిపోయారని బెన్సన్ వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై సమీక్ష జరపుతున్నామని ఎయిర్ కెనడా స్పందించింది. నిబంధనల ఉల్లంఘన జరిగిందని అంగీకరించింది.


More Telugu News