మహాశివుడు మొరాలకించలేదంటూ శివలింగం దొంగతనం!

  • ఉత్తర్‌ప్రదేశ్ కౌశాంబి జిల్లాలో ఘటన 
  • మనసుకు నచ్చిన యువతిని పెళ్లి చేసుకోవాలనుకున్న యువకుడు
  • యువకుడికి కుటుంబసభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత
  • పరమశివుడి సాయంతో వారి మనసు మార్చాలనుకున్న యువకుడు
  • నెల రోజుల పాటు గుడికెళ్లి ప్రార్థనలు, అయినా ఫలితం శూన్యం
  • కోపంలో గుడిలో శివలింగాన్ని దొంగిలించి దాచేసిన యువకుడు
  • గ్రామస్తుల ఫిర్యాదుతో మొత్తం వ్యవహారం బట్టబయలు, నిందితుడి అరెస్ట్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మహాశివుడు తన మొరాలకించలేదంటూ ఓ వ్యక్తి ఏకంగా శివలింగాన్నే దొంగతనం చేశాడు. గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఛోటూ(27) అనే యువకుడు ఓ స్థానిక యువతిపై మనసు పడ్డాడు. ఆమెనే వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ, అతడి కుటుంబం మాత్రం ఇందుకు అంగీకరించలేదు. దైవసహాయంతో కుటుంబసభ్యులను తనవైపు తిప్పుకోవాలనుకున్న అతడు పరమశివుడిని ఆశ్రయించాడు. ఏకంగా నెల రోజుల పాటు క్రమం తప్పకుండా గుడికెళ్లి ప్రార్థించాడు. కానీ, కుటుంబసభ్యుల్లో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు. దీంతో, శివుడు తన మొరాలకించలేదని కోపం పెంచుకున్న అతడు శివలింగాన్ని ఎత్తుకెళ్లి సమీపంలోని పొదల్లో దాచేశాడు. 

మరునాడు ఉదయం గ్రామస్థులకు గుడిలోని శివలింగం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, ఛోటూ చేసిన పని వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 3న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. అతడు పొదల్లో దాచిన శివలింగాన్ని పోలీసులు గుర్తించగా గ్రామస్థులు గుళ్లో మళ్లీ ప్రతిష్టించారు. మరోవైపు, నిందితుడిని జ్యూడీషియల్ కస్టడీకి తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది.


More Telugu News