రైతు ఆత్మహత్యలపై కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

  • రైతుల ఆత్మహత్యలను ప్రేమ వ్యవహారంతో పోల్చిన మంత్రి
  • పరిహారం కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ దారుణ వ్యాఖ్యలు
  • వివాదాస్పదం కావడంతో అలా అనలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం
రైతుల ఆత్మహత్యలపై కర్ణాటక మంత్రి శివానంద్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆత్మహత్యలను ప్రేమ వ్యవహారాలతో పోల్చడమే కాకుండా, పరిహారంకోసం వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దారుణ వ్యాఖ్యలు చేశారు. హవేరీలో మీడియా సమావేశంలో పాటిల్ మాట్లాడుతూ... మరణించిన రైతు కుటుంబాలకు అందించే నష్టపరిహారాన్ని ప్రభుత్వం పెంచిందని, ఆ తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు భారీగా పెరిగాయన్నారు. గతంలో ఈ కేసులు తక్కువగా ఉన్నాయన్నారు.

ప్రభుత్వం నుంచి ప్రజలు పరిహారాన్ని కోరడంలో తప్పులేదని, కానీ కొన్ని సందర్భాలలో ఆర్థిక సహాయం కోసం వ్యక్తుల సహజ మరణాలను కూడా ఆత్మహత్యలుగా తప్పుడు నివేదికలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. పాటిల్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

దీంతో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యలు చేసుకునేవారిని రైతులు అంటారా? రైతు ఆత్మహత్యలపై నివేదిక ఎక్కడిది? అన్నారు. కర్ణాటక రైతుల ప్రయోజనాలను తాము కాపాడుతున్నామని, వారిని ఎలా కాపాడాలో తమకు తెలుసునని చెప్పారు. బీజేపీ, జేడీఎస్‌లు ఈ అంశంపై రాజకీయం చేస్తున్నాయన్నారు.

తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పాటిల్ కూడా బుధవారం స్పందించారు. మీరంతా నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, నష్టపరిహారం పెరిగిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరిగాయని చెప్పాను కానీ, నష్టపరిహారం పెరగడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు చెప్పలేదన్నారు.


More Telugu News