ఎంపీ కోమటిరెడ్డి అసంతృప్తి?.. కేసీ వేణుగోపాల్ ఫోన్!

  • పార్టీలో ప్రాధాన్యత లేదని కోమటిరెడ్డి అసంతృప్తి?
  • పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్న వేణుగోపాల్
  • సాయంత్రం హైదరాబాద్ వచ్చాక కలుస్తానని వెల్లడి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆయనకు ఫోన్ చేశారు. పార్టీలో ప్రాధాన్యతలేదని ఆయన అలక వహించినట్లుగా తెలుస్తోంది. దీంతో కేసీ వేణుగోపాల్ ఆయనకు ఫోన్ చేశారని తెలుస్తోంది. పార్టీలో సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామన్నారు. సాయంత్రం హైదరాబాద్ వచ్చాక కలుస్తానని చెప్పారు.

మరోవైపు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే... కోమటిరెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం తర్వాత నేరుగా ఆయన ఎంపీ నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఠాక్రే మాట్లాడుతూ... ఆయన అసంతృప్తితో లేరన్నారు.

కోమటిరెడ్డి అలక విషయమై కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క కూడా స్పందించారు. ఆయన పార్టీకి చాలా ముఖ్యమైన నేత అన్నారు. ఆయనకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అభ్యర్థుల ప్రకటన గురించి స్పందిస్తూ... త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. కాగా, సీనియర్ నేత అయిన తనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘంలోకి తీసుకోకపోవడంతో పాటు స్క్రీనింగ్ కమిటీలోనూ కనీసం సభ్యుడిగా తీసుకోకపోవడంపై కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.


More Telugu News