పోలీసుల నోటీసులను తిరస్కరించిన నారా లోకేశ్.. జగన్ పై విమర్శలు

  • లోకేశ్ కు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన భీమవరం సీఐ
  • దాడికి పాల్పడిన వైసీపీ వాళ్లకు నోటీసులు ఇవ్వాలన్న లోకేశ్
  • 2019 వరకు తనపై ఒక్క కేసు కూడా లేదని వ్యాఖ్య
పక్కా పథకం ప్రకారమే యువగళం పాదయాత్రపై నిన్న రాత్రి వైసీపీ మూకలు రాళ్లు, సోడాబుడ్డీలతో దాడికి తెగబడ్డాయని టీడీపీ యువనేత నారా లోకేశ్ మండిపడ్డారు. తాము చట్టాన్ని గౌరవించే వ్యక్తులమని, ఎవరినీ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. తనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన భీమవరం సీఐ ప్రసాద్ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు కాకుండా, చట్టాన్ని అతిక్రమించిన వారికి నోటీసులు ఇవ్వాలని అన్నారు. భీమవరం సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భీమవరం సీఐ సైట్ వద్దకు నోటీసులు తీసుకురాగా, లోకేశ్ వాటిని సున్నితంగా తిరస్కరించారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... ఇది ఎన్నికల సమయం కాదని, అన్ని వెహికల్స్ పెట్టకూడదని పోలీసులు ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు. ప్రజలు అభిమానంతో వారి వారి వాహనాల్లో వస్తారని... తాము శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నామని, తామెక్కడా గొడవలు సృష్టించడంలేదని అన్నారు. తనకిస్తున్న నోటీసును వైసీపీ వారికి ఎందుకు ఇవ్వడంలేదని అడిగారు. పేదలకు, పెత్తందార్లకు యుద్ధమని తమ అధినేత చంద్రబాబు ఫొటోలు వేశారని... జగన్ కు లక్ష కోట్ల ఆస్తి ఉందని, రూ.12 కోట్లు ఖర్చు పెట్టి లండన్ కి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లాడని, లక్ష రూపాయల చెప్పులు వేసుకుంటున్నాడని, వెయ్యి రూపాయలు విలువ చేసే వాటర్ బాటిల్ ని తాగుతున్నాడని, పెత్తందారు ఎవరు? అని ప్రశ్నించారు. జగన్ ను తాను ఏం కించపరిచానో ఆయనే చెప్పాలని అన్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న తనకు నోటీసులు ఎలా ఇస్తారు? వైసీపీ కార్యకర్తలను గొడవకు ప్రేరేపించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు నోటీసులివ్వాలని చెప్పారు.

2019 వరకు తనపై ఒక్క కేసు కూడా లేదని, చట్టాన్ని ఉల్లంఘించాలనే ఆలోచన తనకు లేదని... వైసీపీ నాయకులు తమ జోలికి వస్తే ఏం చేయాలో మీరే చెప్పండని లోకేశ్ అన్నారు. వైసీపీ వాళ్లు రాళ్లు విసరడంతో పోలీసులకు కూడా గాయాలయ్యాయని, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో గాయపడ్డారని చెప్పారు. ఎంపీ మిథున్ రెడ్డికి ఇక్కడ ఏం పని అని ప్రశ్నించారు. పుంగనూరు పంచాయతీని ఇక్కడకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. కొందరు పోలీసులు చేస్తున్న పనుల వల్ల రాష్ట్రానికి, డిపార్టుమెంటుకు చెడ్డ పేరు వస్తోందని అన్నారు.


More Telugu News