హైవేపై లారీని అడ్డంగా ఆపిన డ్రైవర్.. వేగంగా వచ్చి ఢీకొన్న వ్యాన్.. ఆరుగురి దుర్మరణం

  • తమిళనాడులోని సేలం-ఈరోడ్ హైవేపై ఘోరం
  • లారీని అడ్డంగా ఆపేసిన డ్రైవర్
  • ప్రమాద సమయంలో వ్యాన్ లో ఎనిమిది మంది ప్రయాణం
ఓ లారీ డ్రైవర్ బాధ్యతారాహిత్యం ఆరుగురి ప్రాణాలను బలితీసుకుంది. జాతీయ రహదారిపై లారీని పద్ధతి ప్రకారం కాకుండా, అడ్డంగా పార్క్ చేయడంతో అది ప్రమాదానికి దారితీసింది. లారీ వెనుక భాగం రోడ్డు అంచున కాకుండా రోడ్డుకు మధ్యకు వచ్చే విధంగా లారీని డ్రైవర్ నిలిపివేశాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన వ్యాన్ లారీని బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ప్రమాదం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. లారీని వ్యాన్ ఢీకొని ఆగిపోగా, కొన్ని సెకన్ల తర్వాత లారీ డ్రైవర్ విషయాన్ని గ్రహించి కనీసం కిందకు దిగకుండా దాన్ని అలాగే ముందుకు పోనిచ్చేశాడు. అక్కడి నుంచి తప్పించుకుపోయాడు. తమిళనాడులోని సేలం-ఈరోడ్ హైవేపై బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో వ్యాన్ లో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా ఎంగూర్ నుంచి పెరుంతరైకి వెళుతున్నారు. తీవ్ర గాయాలతో ప్రమాద స్థలంలోనే ఆరుగురు మరణించారు. గాయపడిన డ్రైవర్, మరో వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.


More Telugu News