నన్ను అలాంటి ప్రశ్నలు అడగకండి: జర్నలిస్ట్‌పై రోహిత్ శర్మ అసహనం

  • టీమిండియా ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయని, ఏం చెబుతారని అడిగిన జర్నలిస్ట్
  • బయటి వాటి గురించి పట్టించుకోమని, ఇదే విషయం పలుమార్లు చెప్పానన్న రోహిత్ శర్మ
  • బయట ఏం మాట్లాడుకుంటున్నారో పట్టించుకోమని వ్యాఖ్య
ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించింది. గాయం నుండి బయటపడిన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ 15 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఉంటున్నారు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్క్వాడ్‌ను ప్రకటిస్తున్న సమయంలో రోహిత్ శర్మ ఆ పక్కనే కూర్చున్నారు. ఈ సమయంలో ఓ జర్నలిస్ట్‌పై రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశారు.

రోహిత్ శర్మ మాట్లాడుతూ... తన జట్టుపై పూర్తి నమ్మకం ఉందని, అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని పేర్కొన్నారు. క్రికెట్‌లో 50 ఓవర్ల ఫార్మాట్ భిన్నమైనదని, నిలకడగా ఆడుతూనే అవసరమైతే దూకుడు పెంచవలసి ఉంటుందన్నారు. ప్రపంచ కప్ కోసం పదిహేను మందిని ఎంపిక చేయడం కఠిన సవాలే అన్నారు. ప్రత్యర్థి విసిరే సవాల్‌ను బట్టి తుది జట్టుతో బరిలోకి దిగుతామన్నారు. భారత్‌లో అద్భుతమైన టాలెంట్ ఉందని, కానీ 15 మందినే ఎంపిక చేయవలసి ఉంటుందన్నారు.

ఈ సమయంలో ఓ జర్నలిస్ట్ మెగా టోర్నీల్లో టీమిండియా ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయని, ఇలాంటి వాటిపై మీ స్పందన ఏమిటని ప్రశ్నించారు. దీనికి రోహిత్ కాస్త ఘాటుగానే స్పందించారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టినప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడగవద్దని, బయటి వాటి గురించి పట్టించుకోవద్దని, ఇదే విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పానన్నారు. బయటివారు ఏం మాట్లాడారనేది తాము పట్టించుకోమని, జట్టులోని ప్రతి ఆటగాడు ప్రొఫెషనల్ క్రికెటరే అన్నారు. ఆసియా కప్ కోసం బయలుదేరే ముందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లోనూ ఇదే చెప్పానన్నారు. ఇలాంటి ప్రశ్నలపై పదేపదే స్పందించడం కూడా సరికాదని, ఇప్పుడు తమ దృష్టి అంతా ఆటమీదే అన్నారు. బయట ఏం మాట్లాడుకుంటున్నారో పట్టించుకోమన్నారు.


More Telugu News