సనాతన ధర్మం గురించి తెలియకుండా మాట్లాడొద్దు: ఉదయనిధికి భూమన హితవు

  • సనాతన ధర్మాన్ని కరోనా, మలేరియా, డెంగీతో పోల్చిన ఉదయనిధి
  • సనాతన ధర్మాన్ని నిర్మూలించకపోతే ప్రమాదమని వ్యాఖ్యలు
  • ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించిన భూమన
  • సనాతన ధర్మం అనేది ఓ మతం కాదని స్పష్టీకరణ
ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించారు. 

సనాతన ధర్మం భయంకరమైన వ్యాధి వంటిదని, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను భూమన ఖండించారు. సనాతన ధర్మం అనేది మతం కాదని, అదొక జీవన ప్రయాణం అని స్పష్టం చేశారు.

సనాతన ధర్మం విశిష్టత తెలియకుండా విమర్శించడం మంచిది కాదని హితవు పలికారు. సనాతన ధర్మాన్ని కులాలతో ముడివేసి విమర్శలు చేయడం వల్ల సమాజంలో దుష్పరిణామాలు చెలరేగే అవకాశం ఉంటుందని భూమన అభిప్రాయపడ్డారు. 

టీటీడీ సమావేశం సందర్భంగా, దేశంలో సనాతన ధర్మ వ్యాప్తికి కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.


More Telugu News