విద్యుత్ కోతలను నివారించాల్సిన ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లారు: పురందేశ్వరి
- విద్యుత్ కోతలపై ప్రభుత్వం గందరగోళం చేస్తోందన్న పురందేశ్వరి
- విద్యుత్ విధానంపై ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శ
- విద్యుత్ కార్యాలయాలను ప్రజలు ముట్టడించే పరిస్థితి ఉందని వ్యాఖ్య
కరెంట్ కోతలపై వైసీపీ ప్రభుత్వం గందరగోళ ప్రకటనలు చేస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. విద్యుత్ కోతలు ఉంటాయని ఒకసారి, ఉండవని మరోసారి ప్రకటన చేశారని... అంటే విద్యుత్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదనే విషయం అర్థమవుతోందని అన్నారు. గ్రామాల్లో తొమ్మిది గంటల పాటు విద్యుత్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చి మోసం చేశారని, గ్రామాల్లోని ప్రజలు విద్యుత్ కోతతో అల్లాడుతున్నారని చెప్పారు. ప్రజలు విద్యుత్ కార్యాలయాలను ముట్టడించే పరిస్థితి ఉందని అన్నారు. ఒక రోజుకు 240 మిలియన్ యూనిట్లు అవసరమైతే, కేవలం 198 మిలియన్ యూనిట్లు మాత్రమే అందుతోందని విమర్శించారు. విద్యుత్ అవసరాలు, వినియోగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలను నివారించాల్సిన ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లిపోయారని దుయ్యబట్టారు.