ఆగని వాన.. హైదరాబాద్ లో పలు ప్రాంతాలు జలమయం

  • సిటీలోని పలు ప్రాంతాలు జలమయం
  • రోడ్లపై ఎక్కడివక్కడ నిలిచిన వాహనాలు
  • మూసాపేట మెట్రో స్టేషన్ కింద భారీగా నిలిచిన వరద నీరు
  • ఆరాంఘర్ హైవేపై వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
  • జంట జలాశయాల గేట్లు ఎత్తిన అధికారులు
తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్‌ అస్తవ్యస్తం అయింది. జనజీవనం స్తంభించిపోయింది. పలు కాలనీలు నీటమునిగాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతూ రోడ్లన్నీ కాలువల్లా మారాయి. మోకాల్లోతు నీరు చేరడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ జీహెచ్ఎంసీ అధికారులు నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. సిటీలోని పలు ప్రాంతాలు నీట మునగడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వర్ష బీభత్సానికి అనేకచోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి.

ప్రధాన రహదారులపైకి చేరిన వరద నీటిలో బైకులు, కార్లు ఆగిపోవడంతో వాహనదారులు తిప్పలు పడుతున్నారు. మూసాపేట మెట్రో స్టేషన్ కింద వరద నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో కూకట్ పల్లి వైపు వెళ్లే, అటు నుంచి ఎర్రగడ్డ వైపు వచ్చే వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆరాంఘర్‌ జాతీయ రహదారిపై శ్రీనగర్‌ సమీపంలో ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకుపోయాయి. దీంతో జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ట్రాఫిక్‌ పోలీసులు అతికష్టం మీద వాటిని బయటకు లాగారు. 

బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగరవాసులను కోరారు. ఏదైనా సమస్య ఎదురైతే సాయం కోసం జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 040-21111111, డయల్ 100, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. అదేవిధంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లు తెరిచారని చెప్పారు. ఈ నేపథ్యంలో మూసీ నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. హెల్ప్ లైన్‌కు వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు.




More Telugu News