లోకేశ్ పాదయాత్రలో వైసీపీ గూండాలు దాడి చేశారు: డీజీపీకి వర్ల రామయ్య లేఖ

  • పలు లేఖలు రాసినా లోకేశ్ కు భద్రతను పెంచలేదన్న వర్ల రామయ్య
  • ఉంగుటూరు నియోజకవర్గంలో పాదయాత్ర గురించి ముందుగానే సమాచారం ఇచ్చామని వ్యాఖ్య
  • దాడి జరుగుతున్నా పోలీసులు ఆపలేదని మండిపాటు
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు సరైన భద్రతను కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఇదే విషయంపై రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. పాదయాత్రలో లోకేశ్ భద్రత గురించి తాను ఇప్పటికే పలు లేఖలు రాసినా లోకేశ్ కు భద్రతను పెంచడం లేదని విమర్శించారు. 

సెప్టెంబర్ 2, 3 తేదీల్లో లోకేశ్ పాదయాత్ర ఉంగుటూరు నియోజకవర్గంలో కొనసాగుతుందని ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ పోలీసులు రక్షణ చర్యలు చేపట్టలేదని అన్నారు. దీంతో, నిడమర్రు మండలం నుంచి మందలపర్రుకు పాదయాత్ర చేరుకున్న సమయంలో వైసీపీ గూండాలు దాడి చేశారని తెలిపారు. లోకేశ్ పాదయాత్ర లోకి దూసుకొచ్చిన వైసీపీ గూండాలు వాహనాలపై దాడి చేశారని, లోకేశ్ వెంట నడిచేందుకు వచ్చిన ప్రజలను కూడా బూతులు తిడుతూ బెదిరించారని మండిపడ్డారు. శాంతియుతంగా జరుగుతున్న పాదయాత్రలో అలజడి సృష్టించారని డీజీపీకి తెలిపారు. దాడి జరుగుతున్నా పోలీసులు ఆపలేదని, పోలీసుల వైఫల్యానికి ఇది నిదర్శనమని చెప్పారు.


More Telugu News