రైల్లో మహిళా పోలీసుపై దాడి.. రైల్వే పోలీసులపై హైకోర్టు గుస్సా

  • ఆగస్టు 30న సరయూ ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్న మహిళా కానిస్టేబుల్‌పై దాడి
  • రక్తపు మడుగులో ఉన్న బాధితురాలు ఆసుపత్రికి తరలింపు
  • ప్రస్తుతం నిలకడగా బాధితురాలి ఆరోగ్యం
  • ఘటనపై అలహాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ
  • బాధ్యతా నిర్వహణలో విఫలమయ్యారంటూ ఆర్‌పీఎఫ్ పోలీసులపై చీఫ్ జస్టిస్ ఆగ్రహం
రైలు కంపార్ట్‌మెంటులో ఓ మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగిన కేసులో అలహాబాద్ హైకోర్టు యూపీ ప్రభుత్వం, రైల్వే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ విధి నిర్వహణలో రైల్వే పోలీసులు విఫలమయ్యారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఆగస్టు 30న సరయూ ఎక్స్‌ప్రెస్‌‌లోని ఓ కంపార్ట్‌మెంట్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ రక్తపుమడుగులో కనిపించింది. ఆమె ముఖం, తలపై గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, దాడి జరిగిన రోజునే బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలిపై ఎటువంటి లైంగిక దాడి జరగలేదని పోలీసులు, మహిళ బంధువులు స్పష్టం చేశారు. 

మరోవైపు, ఈ ఘటన గురించి వాట్సాప్ ద్వారా సమాచారం అందడంతో చీఫ్ జస్టిస్ ప్రీతింకర్ దివాకర్ ఆదివారం సాయంత్రం తన నివాసంలో మరో న్యాయమూర్తి ఆషుతోష్ శ్రీవాత్సవతో కలిసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ద్విసభ్య దర్మాసనం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌పై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చింది. ఘటనపై దర్యాప్తునకు సంబంధించిన వివరాలను సెప్టెంబర్ 13 నాటికి కోర్టుకు సమర్పించాలని గవర్నమెంట్ రైల్వే పోలీసులను ఆదేశించింది.  

ప్రయాగ్‌రాజ్ జిల్లాకు చెందిన బాధిత కానిస్టేబుల్ సుల్తాన్ పూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయోధ్యలో శ్రావణ మాసం మేళా డ్యూటీ కోసం రైల్లో సుల్తాన్ పూర్ నుంచి బయలుదేరారు. అయోధ్యలో ఆమె రైలు దిగాల్సి ఉండగా గాఢ నిద్రలో కూరుకుపోయిన ఆమె మన్కాపూర్ వరకూ వెళ్లిపోయారు. అయోధ్య, మన్కాపూర్‌ స్టేషన్ల మధ్య ఆమెపై దాడి జరిగిందని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి పేర్కొన్నారు. ఈ దాడి వెనుక కారణం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం లక్నోలోని జార్జ్‌ మెడికల్ యూనివర్సిటీలో చికిత్స పొందుతున్న బాధితురాలిని యూపీ పోలీసు ఉన్నతాధికారులు పరామర్శించారు.


More Telugu News