ఆ తిట్లు విని నాకు కన్నీళ్లు ఆగలేదు: కృతి సనన్

  • విజయం అందుకునే క్రమంలో ఒడిదుడుకులు తప్పవన్న  కృతి సనన్
  • కెరీర్‌లో తన చేదు అనుభవాలను మీడియాతో పంచుకున్న వైనం
  • ఓసారి క్యాట్ వాక్ చేస్తుండగా హీల్స్ మడమలు నేలలో కూరుకుపోయాయన్న కృతి
  • గందరగోళానికి లోనైన తను అక్కడే నిలబడిపోవడంతో షో కొరియోగ్రాఫర్ తిట్టిందని ఆవేదన
  • ఆ తిట్లకు దుఃఖం ఆపుకోలేక పక్కకు వెళ్లి ఏడ్చానని వెల్లడి
సక్సెస్ ఫుల్ నటీనటుల లైఫ్‌లోనూ ఎన్నో కష్టాలు ఉంటాయని చెప్పుకొచ్చింది ప్రముఖ నటి కృతి సనన్. ఏదిగే క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయని చెప్పింది. కెరీర్‌ మొదట్లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి గురువారం ఓ మీడియా సంస్థతో పంచుకుంది. 

‘‘నేను ముంబైకి వచ్చిన కొత్తలో ఇది జరిగింది. అప్పట్లో మోడలింగ్ చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేదాన్ని. నా అదృష్టం కొద్దీ ఒకేసారి ‘వన్ నేనొక్కడినే’, ‘హీరోపంతీ’ అనే రెండు సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది. మరికొన్ని రోజుల్లో మూవీ చిత్రీకరణ మొదలవుతుందనగా ఓ ర్యాంప్ షోలో పాల్గొనేందుకు వెళ్లా. పచ్చికలా ఉన్న లాన్‌లో క్యాట్ వాక్ చేస్తున్నా.

ఉన్నట్టుండి నేను వేసుకున్న హీల్స్ మడమలు నేలలోకి దిగబడిపోయాయి. దీంతో, గందరగోళానికి లోనైన నేను మధ్యలోనే ఆగిపోవడంతో.. ఆ షోకి కొరియోగ్రఫీ చేసిన ఆవిడ వెంటనే గట్టిగా అరుస్తూ..దాదాపు యాభై మంది మోడళ్ల ముందు నన్ను దారుణంగా తిట్టింది. నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆ పక్కకి వెళ్లి చాలాసేపు ఏడ్చాను. ఆ తరువాత మళ్లీ ఆమెతో కలిసి పనిచేయలేదు’’ అంటూ ఆనాటి చేదు అనుభవం గుర్తు చేసుకుంది.


More Telugu News