ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ కీలక ప్రకటన!

  • ఉదయనిధి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ప్రకటించిన మమతా బెనర్జీ పార్టీ
  • ఇలాంటి విపరీత వ్యాఖ్యలతో I.N.D.I.A. కూటమికి సంబంధం లేదన్న టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్
  • ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించలేమన్న కునాల్ ఘోష్
సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో I.N.D.I.A. కూటమిలోని ఇతర పార్టీలు నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. ఆయన వ్యాఖ్యలకు దూరం పాటిస్తున్నాయి. ఇప్పటికే ఈ కూటమిలోని కాంగ్రెస్ తాము అన్ని మతాలను గౌరవిస్తామని ప్రకటించగా, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) ఉదయనిధి వ్యాఖ్యలతో విభేదించింది. తాజాగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కూడా స్పందించింది.

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ సోమవారం తీవ్రంగా ఖండించింది, ప్రతిపక్షాల I.N.D.I.A. కూటమికి ఈ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

'ఇలాంటి వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం. సామరస్యం మన సంస్కృతి. ఇతర మతాలను గౌరవించాలి. ఇలాంటి విపరీత వ్యాఖ్యలతో I.N.D.I.A. కూటమికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎవరైనా సరే.. ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే వాటిని ఖండించాల్సిందే'నని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్ అన్నారు.

మరోపక్క, ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో డీఎంకే, I.N.D.I.A. కూటమి చిక్కుల్లో పడింది. సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ తీవ్రంగా స్పందించింది. హిందూ ధర్మంపై ఆ కూటమి ఉద్దేశం వెల్లడవుతోందని బీజేపీ విమర్శలు గుప్పించింది. దీంతో కూటమిలోని కాంగ్రెస్, శివసేన (యూబీటీ), తృణమూల్ తదితర పార్టీలు నష్టనివారణ చర్యలు చేపట్టాయి.


More Telugu News