ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, శివసేన స్పందన

  • అన్ని మతాలను గౌరవించడమే కాంగ్రెస్ స్వభావమన్న కేసీ వేణుగోపాల్
  • ప్రతి రాజకీయ పార్టీకి వాక్ స్వాతంత్య్రం ఉంటుందన్న కాంగ్రెస్
  • ఎన్నో ఆక్రమణదారుల దాడులను తట్టుకొని నిలబడిన ధర్మమన్న ప్రియాంక చతుర్వేది
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల మీద కాంగ్రెస్, శివసేన (ఎంబీటీ) స్పందించాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ... అన్ని మతాలను గౌరవించడమే కాంగ్రెస్ స్వభావమని చెప్పారు. సర్వ ధర్మ సమభావన... కాంగ్రెస్ ఐడియాలజీ అని పేర్కొన్నారు. ప్రతి రాజకీయ పార్టీకి వాక్ స్వాతంత్య్రం ఉంటుందని, ఏ మతాన్ని కాంగ్రెస్ విమర్శించబోదన్నారు. 

I.N.D.I.A. కూటమిలో భాగమైన రాజ్యసభ ఎంపీ, శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది కూడా వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు. సనాతన ధర్మం శాశ్వతమైన సత్యాన్ని సూచిస్తుందన్నారు. ఇది ఎన్నో ఆక్రమణదారుల దాడులను తట్టుకొని నిలబడగలిగిందని చెప్పారు. భారత దేశానికి సనాతన ధర్మమే పునాది అని, అలాంటి ధర్మంపై ఇలాంటి దారుణ వ్యాఖ్యలు సరికాదన్నారు. మరోపక్క, దీనిపై బీజేపీ స్పందిస్తూ.. ఉదయనిధి వ్యాఖ్యలతో I.N.D.I.A. కూటమి స్వభావం తేలిపోయిందని విమర్శలు గుప్పించింది. 


More Telugu News